పార్వతీపురం రూరల్: ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని, పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం పార్వతీపురం డిపో మేనేజర్ లక్ష్మణరావుకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ నేతృత్వంలో వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ప్రయాణికులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు ఈ–బస్సుల విస్తరణ అవసరమైనప్పటికీ, వాటి నిర్వహణ బాధ్యతలను ప్రై వేట్ సంస్థలకు అప్పగించకూడదని స్పష్టం చేశారు. ‘సూపర్ సిక్స్– సీ్త్రశక్తి’ పథకం అమలు, విద్యుత్ బస్సుల కొనుగోలు సాకుతో ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తే ఏఐటీయూసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించా రు. సంస్థ ఆస్తుల పరిరక్షణ, కార్మికుల భద్రతే లక్ష్యంగా నిరంతరం పోరాడతామన్నారు. కార్యక్ర మంలో డిపో నాయకులు డి.ఎ.నాయుడు, జె.ఎం.రావు, కె.బి.రాజు, కె.ఎస్.రావు, టి.జి.స్వామి పాల్గొన్నారు.


