అజేయుడై రావాలి.. | - | Sakshi
Sakshi News home page

అజేయుడై రావాలి..

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

అజేయుడై రావాలి..

కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు కొండవెలగాడ బిడ్డ

దేశం నుంచి బరిలోకి..మరో మూడు రోజుల్లో ప్రదర్శన

ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్న జిల్లా ప్రజలు, క్రీడాకారులు

నెల్లిమర్ల రూరల్‌: ఒక చిన్న గ్రామం నుంచి బయలుదేరిన యువకుడు..ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించే అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్‌ నుంచి బరిలోకి దిగబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల సాధన, వందల గంటల శిక్షణ..ఎన్నో పోటీలు..వందల పతకాలు..ఇప్పుడు ఆ యువకుడి ప్రయాణం కామన్వెల్త్‌ వేదికకు చేరింది. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వెయిట్‌లిఫ్టర్‌ వల్లూరు అజయ్‌బాబు కామన్వెల్త్‌ గేమ్స్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మరో మూడు రోజుల్లో జరగనున్న పోటీ కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరుగుతున్న 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌లో అజయ్‌ భారత్‌ తరఫున 79 కేజీల విభాగంలో పోటీ పడనున్నాడు. ఈ నెల 27 అర్ధరాత్రి 12.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం ఈ నెల 28 తెల్లవారుజామున) గ్లాస్గోలోని ఎస్‌ఈసీ ఆర్మడిల్లో వేదికగా పోటీ జరగనుంది.

తండ్రి స్ఫూర్తితో విజేయుడై..

అజయ్‌బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు ప్రముఖ ఇండియన్‌ వెయిట్‌లిఫ్టర్‌. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో శ్రీనివాసరావు భారత్‌ తరఫున 56 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించారు. ఇప్పుడు 16 ఏళ్ల తరువాత అదే కుటుంబం నుంచి ఆయన కుమారుడు అజయ్‌ కామన్వెల్త్‌ వేదికపై బరిలోకి దిగుతున్నాడు. ఇండియన్‌ ఆర్మీలో సిఫాయి స్థాయి నుంచి జేఏఓ కేడర్‌ వరకు ఎదిగి వల్లూరి శ్రీనివాస రావు రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం స్వగ్రామంలోనే ఉంటూ యువ క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో అజయ్‌బాబు తన ఎనిమిదేళ్ల వయసు నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ప్రారంభించాడు. కఠోర సాధనతో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతూ వచ్చాడు.

బంగారు కొండ అజయ్‌ ు

2021లో పాటియాలాలో జరిగిన యూత్‌, జూనియర్‌, సీనియర్‌ జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకంతో తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అనంతరం భువనేశ్వర్‌, పంచకుల, తమిళనాడు, మద్యప్రదేశ్‌, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌, తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించాడు. కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ అజయ్‌బాబు ప్రతిభ చాటాడు. 2023లో నోయిడాలో జరిగిన జూనియర్‌ కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించాడు. 2024 ఫిజీలో జరిగిన సీనియర్‌ కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. 2026లో అహ్మదాబాద్‌లో జరిగిన సీనియర్‌ కామన్వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో మరోసారి స్వర్ణం సాధించి అత్యతంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే ‘కామన్వెల్త్‌ గేమ్స్‌కు’ అర్హత సాధించాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధించిన ప్రతిభతో అజయ్‌బాబు క్రీడా కోటాలో ఇండియన్‌ ఆర్మీలో జేఏఓ కేడర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. క్రీడలో రాణించడమే కాకుండా దేశ సేవకు అవకాశం లభించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి నేడు అంతర్జాతీయ వేదిక వరకు వెళ్లిన అజయ్‌బాబు విజయం సాధించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. ఆల్‌దిబెస్ట్‌ అజయ్‌బాబు అని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement