● నియంత్రణ ఎవరితరమూ కాదు
● మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
కురుపాం: దేశంలో యువ స్వాతంత్య్ర పోరాటం మొదలైంది.. దానిని నియంత్రించే స్థాయి ఏ ఒక్క రాజకీయ పార్టీలకూ సాధ్యంకాదని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా స్పష్టమైందని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని రకాలు విద్యార్హత పరీక్షల నిర్వహణ, సీట్లు కేటాయింపు పూర్తి అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వైద్యవిద్యార్హత పరీక్ష (నీట్)ను తమ ఆధీనంలోకి తీసుకోవడం చట్టవ్యతిరేకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న విద్యాసంబంధ హక్కులను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే అవుతుందన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందని, ఇది పూర్తిగా కేంద్ర విద్యాశాఖ, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీరు అత్యంత విచిత్రంగా ఉందని, ప్రతి పక్షంలో ఒకలా, అధికారంలో మరోలా ఉందన్నారు. ఇదే వ్యక్తి 1997లో ఏబీవీపీ నాయకుడిడా ప్రశ్నపత్రం లీకేజీ పై పోరాటం చేశారని, ఇప్పుడు విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం నియంత్రుత్వ పోకడకు నిదర్శనమన్నారు. విద్యార్థుల పోరాటం దేశవ్యాప్తమైందని, దీనిని నియంత్రించడం ఎవరితరమూ కాదన్నారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ ఫెడరల్ వ్యవస్థను బలహీన పరిచే అనేక కుట్రలకు పాల్పడిందని విమర్శించారు. కార్పొరేటు దిగ్గజాలు తప్ప దేశంలో మిగిలిన రైతులు, చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు, గుత్తేదారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని, భారత రాజ్యాంగం, అభివృద్ధి, సంక్షేమం, రక్షణ చట్టాలు దశలవారీగా నిర్వీర్యానికి బీజేపీ కుట్ర పూరిత నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. గత యాభైఏళ్లలో మునుపెన్నడూ లేని పోరాటం తీవ్రతను ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్‌లో చూస్తున్నామని తెలిపారు.
26న జిల్లా స్థాయి అధ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
గుమ్మలక్ష్మీపురం: మండల కేంద్రంలోని హెచ్ గ్రౌండ్ వద్ద ఈనెల 26న జిల్లా స్థాయి అధ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ క్రీడా నిర్వాహకుడు, పీడిపత్తిక చంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..ఉమ్మడి విజయనగరంజిల్లా కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని, ఈ ఎంపిక పోటీలకు 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గల బాలబాలికలు అర్హులని, పాల్గొనదలిచిన బాలబాలికల్లో పదో తరగతి లోపు చదివే వారు ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్‌ను, పదో తరగతి పాసై ఇంటర్, డిగ్రీ చదివే వారు టెన్త్ మార్కుల లిస్ట్‌ను తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్ 9490026935, 9492630815 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


