కొమరాడ: మండలంలోని పెదఖేర్జిల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహం విద్యార్థులపై జ్వరాలు పంజావిసురుతున్నాయి. వైరల్ జ్వరాల వ్యాప్తితో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఆస్పత్రుల బాట పడుతున్నారు. వసతిగృహానికి చెందిన నలుగురు విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కొమరాడ పీహెచ్‌సీని బుధవారం ఆశ్రయించారు. 304 మంది విద్యార్థులు చదుతున్న వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లోపించాయి. పడుకునేందుకు సరిపడా గదులు లేవు. పారిశుద్ధ్యం లోపించడంతో జ్వరాలు వ్యాప్తిచెందుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వైద్యాధికారులు స్పందించి వసతిగృహంలో వైద్యశిబిరం నిర్వహించి సేవలు అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వైద్యం అందిస్తున్నాం..
పెదఖేర్జిల వసతిగృహం నుంచి ప్రతిరోజు ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. వారికి వైద్యసేవలు అందిస్తున్నాం. విద్యార్థులకు చర్మవ్యాధుల సమస్య కూడా ఉంది. వసతిగృహంలో సిక్ రూమ్ సమస్యతో పాటు పారిశుద్ధ్యం, పౌష్టికాహారం లోపం లేకుండా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు ఆరోగ్యం సమకూరుతుంది.


