రామకోనేరు వద్ద స్వామివారికి
చక్రతీర్థస్నానం జరిపిస్తున్న అర్చకులు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని వెనుకబడిన తరగతుల కళాశాల బాలుర వసతి గృహంలో పరిస్థితి చూస్తే ’చదువు అటకెక్కి.. తిండి గాలికి పోయినట్లు’ కనిపిస్తోంది. అద్దె భవనంలో అగచాట్లు, అందని వసతులు, అస్తవ్యస్తంగా ఉన్న మెనూ మధ్య విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం అంతా ‘అరకొర’ తంతుగానే సాగుతోంది. వసతి గృహంలో మొత్తం 79 మంది విద్యార్థులకు సోమవారం 72 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం మజ్జిగ, వెజిటబుల్ కర్రి, సాంబార్, ఫ్రూట్ అందించాలి. 72 మంది విద్యార్థులకు కేవలం 3 లీటర్ల పెరుగు ప్యాకెట్లు, 36 పండ్లు మాత్రమే సిద్ధం చేశారు. అంటే ఒక్కో విద్యార్థికి సగం పండు, చుక్క మజ్జిగే దిక్కు!. ఇక వంటశాలలో బెండకాయ కూర, సాంబార్ పరిమాణం చూస్తే అది విద్యార్థుల ఆకలి తీరుస్తుందా? లేక ఆశ చూపిస్తుందా? అన్నట్లుగా ఉంది. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ వసతి గృహంలో మౌలిక వసతులు మచ్చుకై నా కానరావు. సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిద్రించే గదుల పరిస్థితి మరీ ఘోరం. కిటికీలకు తలుపులు లేకపోవడంతో, చలి, దోమల నుంచి రక్షణ కోసం విద్యార్థులు కిటికీలకు తమ దుప్పట్లనే తెరలుగా కట్టుకోవడం ఇక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. మెనూ అమలుపై హాస్టల్ వెల్ఫేర్ అధికారి సీహెచ్ హారిక వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 52 ఖర్చు చేస్తోందని, నిబంధనల మేరకే 120 గ్రాముల కూరను అందిస్తున్నామని సెలవిచ్చారు.
72 మంది విద్యార్థులకు సోమవారం రాత్రి భోజనానికి సిద్ధం చేసిన బెండకాయ కూర, సాంబారు


