జియ్యమ్మవలస (రూరల్): పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు. చినమేరింగి పోలీస్ స్టేషన్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల రికార్డులు పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేటు తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్‌ఐ అనిషి, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఇసుక విధానం అమలెక్కడ?
బొబ్బిలి: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక విక్రయాలకు రెండింతల ధరలు పలుకుతున్నాయని ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేరుతో ఇసుక మాఫీయా నడుస్తోందని, నదులు, వాగుల, గెడ్డల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక విధానం అమలు కావడం లేదని, టన్ను ఇసుక ధర గతం కంటే రెండింతలు పెరిగిందని ఆరోపించారు. వేగావతి పరీవాహక ప్రాంతంలో 10 అడుగుల లోతుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల భవిష్యత్‌లో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పవన్నారు.


