ఇదేం పని మాస్టారూ..!
చికెన్
● పంచాయతీ కాలువను కప్పేస్తున్న టీడీపీ నేత
నెల్లిమర్ల రూరల్: ఆయనొక విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. పైగా టీడీపీ సర్పంచ్‌కు స్వయంగా బావ. ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా..నలుగురికీ ఏది మంచి ఏది చెడో చెప్పాల్సిన ఆయనే తన ఇంటివద్ద పంచాయతీ కాలువను ఎటువంటి అనుమతులు లేకుండా కప్పేస్తున్నాడు. ఈ తతంగాన్ని చూసిన స్థానికులు నివ్వెరపోతున్నారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏళ్ల కాలం నుంచి పెను సమస్యగా ఉన్న సీసీలు, డ్రైన్ల నిర్మాణాన్ని సుమారు రూ.కోటి నిధులతో పూర్తి చేశారు. ప్రధాన వీధిలో సదరు టీడీపీ నేత పంచాది సూర్యనారాయణ ఇంటి ఎదురుగా కూడా విశాలమైన సీసీ రహదారితో పాటు డ్రైన్ నిర్మించారు. తన ఇంటి వాస్తుకు విరుద్ధంగా ఉందనే నెపంతో గడిచిన రెండు రోజుల నుంచి ఆయన పంచాయతీ కాలువను తొలగించి ఇంటి కాంపౌండ్ నిర్మాణాన్ని చేపడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. కాలువను మూసేస్తే మురుగునీరు ఎలా ప్రవహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై స్థానికులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన శుక్రవారం పరిశీలించారు. సదరు కార్యదర్శి వారించినప్పటికీ సర్పంచ్ తన ఇంట్లో మనిషే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. కాలువను వేరే మార్గంలో ఏర్పాటు చేస్తానని చెప్పి సదరు టీడీపీ నేత తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అందరికీ చెప్పాల్సిన నాయకులే ఈ విధంగా అడ్డదారులు తొక్కడంపై జనం మండి పడుతున్నారు. కాలువను ఆయనొక్కడే ఆక్రమించినట్లు ఉండదని, గ్రామంలోని మిగిలిన వారంతా ఇక అదే పని చేస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాలువలను ఆక్రమిస్తే మురుగు నీటి పరిస్థితి ఏమిటని, ప్రజారోగ్యం ఏమవాలని ప్రశ్నిస్తున్నారు.
ఇదేం పని మాస్టారూ..!


