నకిలీ రశీదులతో బురిడీ
వీరఘట్టం: పంచాయతీ సిబ్బంది చేతివాటం చూపారు. నకిలీ ఇంటి బిల్లులతో వీరఘట్టం మేజర్ పంచాయతీ ప్రజల నుంచి రూ.20లక్షల వరకు గోల్‌మాల్ చేశారు. విషయం తెలియడం, సదరు సిబ్బంది బదిలీపై వెళ్లిపోవడంతో పంచాయతీ ప్రజలు ఆందోళన చెందతున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన బిల్లు కలెక్టర్లు ఇంటి పన్నుల వసూలుకు వెళ్లగా.. తాము ఇప్పటికే ఇంటి పన్నులు కట్టినట్లు రసీదులు చూపిస్తున్నారు. అవి నకిలీ రశీదులని, ఐదారేళ్లుగా ఇంటిపన్ను కట్టలేదని ప్రస్తుత పంచాయతీ బిల్లు కలెక్టర్లు చెబుతుండడంతో మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ పరిస్థితి....
వీరఘట్టం మేజరు పంచాయతీలో సుమారుగా 4,500 గృహాలు, దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. వీటిలో 3,906 గృహాలు మాత్రమే పంచాయతీ రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ గృహాలకు ఈ ఏడాదికి రూ.33 లక్షల వరకు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. పాత బకాయిలు (ఎరియర్) గత ఏడేళ్ల నుంచి వసూలు చేయాల్సినది రూ.23 లక్షలు ఉంది. మొత్తం ఇంటి పన్నులు రూ.56 లక్షలకు ఇంత వరకు ఈ ఏడాది రూ.7 లక్షలు వసూలు చేశారు. కొంత మంది ఇప్పటికే ఇంటిపన్ను చెల్లించామంటూ రసీదులు చూపిస్తుండడంతో ప్రస్తుత సిబ్బంది నివ్వెరపోతున్నారు. గతంలో వీరఘట్టం మేజర్ పంచాయతీలో పనిచేసిన కొందరు ఉద్యోగులు ఇంటి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి జమచేయకుండా కాజేసినట్లు గుర్తించారు.
మా నాన్న రామచంద్రరావు పేరున ఉన్న ఇంటి నంబర్ 1705కు గత ఆరేళ్లకు సంబంధించి పాత బకాయిలతో కలిపి రూ.17,606లను రెండేళ్ల కిందట చెల్లించాను. అప్పటి ఉద్యోగి రసీదులు కూడా ఇచ్చారు. ఈ ఏడాది రూ.20,965లు చెల్లించాలని ఇటీవల పంచాయతీ సిబ్బంది అడిగారు. నేను కట్టిన రసీదు చూపించడంతో నా వద్ద ఉన్నవి నకిలీవి అంటున్నారు. గతంలో పనిచేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుని నా ఇంటి పన్నును క్లియర్ చేయాలి.
– దౌలూరు శ్రీనివాసరావు, వీరఘట్టం
వీరఘట్టం మేజరు పంచాయతీలో ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పన్నును పక్కదోవ పట్టించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నంబర్ 1795లో ఉంటున్న ఇంటికి గత ఆరేళ్లుగా రూ.15,489లు చెల్లించాను. ప్రస్తుత సిబ్బంది పాత బకాయిలతో కలిపి రూ.19,179లను కట్టమని నోటీసు ఇచ్చారు. నోటీసు ఇవ్వడంతో అసలు విషయం తెలిసింది.
– వూణ్న సురేష్, వీరఘట్టం
వీరఘట్టంలో చాలా మంది ఇంటి పన్నులు కట్టినట్లు రసీదులు చూపిస్తున్నారు. వారు కట్టినట్లు మా రికార్డుల్లో లేవు. ప్రజలకు నకిలీ ఇంటి పన్ను రసీదులు ఇచ్చి డబ్బులు కాజీసిన ఉదంతంపై విచారణ చేపడతాం. ఇంటి పన్ను దొంగలను పట్టుకుని ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. బాధితులందరూ రశీదులు తీసుకుని సచివాలయాన్ని సంప్రదించాలి. – వై.గిరి, ఈఓ,
వీరఘట్టం మేజరు పంచాయతీ
ఇంటి పన్ను వసూళ్లలో పంచాయతీ సిబ్బంది చేతివాటం
వీరఘట్టం మేజరు పంచాయతీలో రూ.20 లక్షలు గోల్‌మాల్
ఆవేదనలో పంచాయతీ ప్రజలు
నకిలీ రశీదులతో బురిడీ
నకిలీ రశీదులతో బురిడీ
నకిలీ రశీదులతో బురిడీ


