మహాప్రస్థానం వాహన సదుపాయానికి ప్రతిపాదనలు
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహా ప్రస్థానం వాహనం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు తెలిపారు. భద్రగిరి సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కడ్రక రాధమ్మ శుక్రవారం మృతిచెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ వాహనం లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడైన తన తమ్ముడు రోజూ చెత్త తరలించే రిక్షాలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ హృదయ విదారకర ఘటనపై ‘అక్కా క్షమించు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీసీహెచ్‌ఎస్ స్పందించారు. భద్రగిరి సీహెచ్‌సీని శనివారం సందర్శించారు. ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మృతదేహాన్ని తరలించేందుకు భద్రగిరి ఆస్పత్రికి ప్రత్యేకంగా ఎటువంటి వాహనం కేటాయించలేదని, మహా ప్రస్థానం వాహనం మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. అప్పటివరకు ప్రత్యామ్నాయంగా అంబులెన్స్‌తో పాటు ఆయిల్ సదుపాయం కల్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఆయన వెంట సీహెచ్‌సీ వైద్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు.
మహాప్రస్థానం వాహన సదుపాయానికి ప్రతిపాదనలు


