దాడి చేసిన వారిని శిక్షించాలి
భోగాపురం: మండలంలోని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ్‌నగర్ కాలనీకి చెందిన దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాలనీ మీదుగా నిర్మించిన మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించడంతో పాటు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సిద్ధార్థ్‌నగర్‌కు చెందిన దళితులు 22 రోజులుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దళితనేత, మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ముంజేరు గ్రామంలోని వాడుకనీరు వేరే మార్గం వైపు పోయేదని.. అయితే వాడుకనీరు పోయేందుకు వీలుగా సిద్ధార్థ్‌నగర్ కాలనీ మీదుగా కాలువ నిర్మించి, పనులు మధ్యలో నిలిపివేయడంతో మురుగునీరంతా కాలనీలో నిలిచిపోతోందని చెప్పారు. ఇదేమని అడిగిన వారిప కొంతమంది దాడి చేశారన్నారు. కాలువను నాగులగెడ్డ వద్దకు నిర్మించి మురుగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాలకు చెందిన నాయకులు, దళితులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్


