ఇంటి స్థల ఆక్రమణపై ఆరా
భామిని: మండలంలోని మాసగూడకు చెందిన బిడ్డిక ఈనత్తు, లక్ష్మీకి చెందిన ఇంటిస్థలం ఆక్రమణపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆదివాసీ కుటుంబానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలంలో రాజకీయ కక్షతో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం తలపెట్టడంతో బాధిత కుటుంబం కన్నీరుపెట్టింది. ఇదే విషయంపై ‘ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష’ అనే శీర్షిక ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ శివన్నారాయణ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మండల సర్వేయర్ రాజేశ్వరరావు, ఎమ్మారై మణి ప్రభాకర్, వీఆర్వో గిరిబాబుల బృందం మాసగూడలో ఆదివాసీ కుటుంబానికి ఇచ్చిన ఇంటి స్థల పట్టాను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థల పట్టా సరిహద్దులు సరిచూశారు. ప్రస్తుతం ఆదివాసీ కుటుంబం తలదాచుకొంటున్న పాక స్థలం గుర్తించారు. రోడ్డు పక్కనే స్కూల్‌కు ఎదురుగా అంగన్‌వాడీ కేంద్రానికి స్థలం కేటాయించామని అధికారులు వివరించారు. లబ్ధిదారు కుటుంబం సమ్మతిస్తే స్కూల్ వెనుక భాగంలోని డీ పట్టా భూమిలో ఇంటి స్థలం మంజూరు చేస్తామని సర్దిచెప్పారు. దీనికి గిరిజన కుటుంబం సమ్మతి తెలిపింది. కాగా, ఇదే సమయంలో కూటమి నాయకుడు రెవెన్యూ అధికారులపై ఫోన్‌లో కేకలు వేయడం వినిపించింది. ఆదివాసీ కుటుంబంపై కూటమి నాయకుడు కక్షసాధింపులకు దిగడంపై గ్రామస్తులు తప్పుబడుతున్నారు.
ఇంటి స్థల ఆక్రమణపై ఆరా


