రైతు కంటకన్నీరు..!
20 రోజులుగా తిరుగుతున్నాం
అదనంగా ధాన్యం ఇవ్వడానికి సిద్ధం
పాలకొండ:
ధాన్యం అమ్మకాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. మొదటి నుంచి రైస్ మిల్లర్లు పలు రకాలుగా రైతులను దోచుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుతో మిల్లర్లు మరింత మొండికేస్తున్నారు. ఈ ఏడాది సక్రాంతికి కూడా ధాన్యం అమ్మకోలేమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామంలో వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు రైతుల వద్దనే ఉన్నాయి.
ఒక్క మిల్లుకూ లేని బీజీలు
పాలకొండ మండల పరిధిలో 7 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు లేవని గడిచిన వారం రోజులుగా రైతుల నుంచి ధాన్యం తీసుకోవడం లేదు. దీంతో రైతులు పండించిన పంట ప్రస్తుతం గ్రామాల్లో పోగులుగా వేసి ఉన్నాయి. నూర్పులు వేసి ధాన్యం బస్తాల్లో వేసి సుమారుగా 20 రోజుల నుంచి కళ్లాల్లోనే ఉంచుతున్నారు.
ఇతర మండలాల నుంచి తరలింపు
ప్రస్తుతం పాలకొండ రైస్ మిల్లులకు జిల్లాలోని సాలూరు, పార్వతీపురం ప్రాంతాల నుంచి ధాన్యం లారీలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. మిల్లర్లు బీజీలు లేవంటూనే ఇతర మండలాల నుంచి ఇక్కడికి ధాన్యం తీసుకువచ్చి దించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజీలు లేకపోయినా ఇతర మండలాల నుంచి ధాన్యం తీసుకోవడం బీజీలు కొంచెం వస్తే ఆ ధాన్యానికి బీజీ మేరకు బిల్లులు చేస్తున్నారు. దీనిపై మిల్లర్లు ఇతర ప్రాంతాల్లో ధాన్యం మంచి దిగుబడి వస్తుందని అందుకే అక్కడి ధాన్యం తీసుకుంటున్నామని చెబుతున్నారు.
ఎఫ్‌సీకి వెళ్లడం లేదు
ధాన్యం రైతుల నుంచి తీసుకోకపోవడంపై మిల్లర్లను ప్రశ్నిస్తే ఎఫ్‌సీకి ధాన్యం వెళ్లడం లేదని చెబుతున్నారు. మూడవ వంతు బీజీలు కూడా ఇంకా రాలేదని, దీంతో ధాన్యం తీసుకోవడం కుదరదని తెగేసి చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీలు వస్తే తప్ప రైతుల నుంచి ధాన్యం తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు.
ధాన్యం నూర్పు చేసి 20 రోజులైంది. అప్పటి నుంచి రైస్ మిల్లుల చుట్టూ తిరుగుతున్నాం. బీజీలు లేవు అంటున్నారు. ఆర్‌ఎస్‌కేలకు వెళ్తే బీజీలు వస్తే ట్రక్‌షీట్ జనరేట్ చేస్తామని చెబుతున్నారు. ఇతర మిల్లుల వద్ద మాత్రం లారీలతో ధాన్యం దించుతున్నారు. అడిగితే మంచి ధాన్యమని అందుకే తీసుకుంటున్నామని చెబుతున్నారు.
– దాసిరెడ్డి నారాయణరావు, రైతు, తంపటాపల్లి
మిల్లులు పెడుతున్న అవస్థలతో విసిగిపోయాం. అదనంగా ధాన్యం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. అయినా ధాన్యం కొనే పరిస్థితి కనిపించడంలేదు. మా గ్రామంలో వేల బస్తాలు పోగులుగా ఉన్నాయి. అధికారులు గ్రామాన్ని సందర్శించి ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకోవాలి. కనీసం సంక్రాంతిలోపు ధాన్యం అమ్ముకోలేకపోతే పండగ కూడా చేసుకోలేము.
–రుంకు వెంకటరమణ, రైతు, తంపటాపల్లి
రైతు కంటకన్నీరు..!
రైతు కంటకన్నీరు..!
రైతు కంటకన్నీరు..!


