కమిషనర్ పోస్టు.. ఎన్నాళ్లో గ్యారంటీ ఉండదు!
● పార్వతీపురం గ్రేడ్ 1 మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి ● ఎవరొచ్చినా మూన్నాళ్ల ముచ్చటే ● తాజా బదిలీల్లో పావని నియామకం
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం పురపాలక సంఘం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడికి కమిషనర్ గా ఎవరొచ్చినా.. మూన్నాళ్ల ముచ్చటే. పట్టుమ ని ఆరు నెలలు కూడా ఉండలేని పరిస్థితి. ఓ వైపు ప్రజలకు మంచి పాలన అందించడం కంటే.. రాజకీయాలకే మున్సిపల్ ప్రజా ప్రతినిధులు పరిమితమవుతున్నారు. స్వలాభం కోసం పార్టీల గోడలు దూకుతున్నారు. అభివృద్ధి పనులకు పలువురు మోకాలడ్డుతున్నారు. మరోవైపు.. రాజులేని రాజ్యంలా మున్సిపాలిటీ తయారైంది. ఉద్యోగులు గ్రూపులతో నిత్యం వీధికెక్కుతున్నా రు. ఫలితంగా మున్సిపాల్టీ విధులు, బాధ్యతలు ఎప్పుడో గాడి తప్పాయి. తాజాగా మరోసారి ఇక్కడి మున్సిపల్ కమిషనర్ మారారు. ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మున్సిపల్ కమి షనర్లను బదిలీ చేయగా.. పార్వతీపురానికి డి.పావనిని నియమించారు. వాస్తవానికి విశాఖ జీవీఎంసీ శానిటరీ సూపర్వైజర్‌గా పనిచేసిన కె.కిశోర్ కుమార్‌ను ఇటీవలే ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమించారు. నెలల వ్యవధిలోనే ఆయనకు స్థాన చలనం కలిగింది.
కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి..
గ్రేడ్–1 మున్సిపాలిటీ అయిన పార్వతీపురం పురపాలక సంఘం.. మన్యం జిల్లా కేంద్రం కూడా నూ! జిల్లాకు కీలకమైన ఈ మున్సిపాలిటీకి కమి షనర్ల గండం ఉంది. కొన్నాళ్లుగా చూసుకుంటే.. గతంలో కె.శ్రీనివాసరావు రెగ్యులర్ కమిషనర్‌గా వచ్చారు. కేవలం ఆరు నెలల కాలమే పని చేశా రు. తర్వాత ఆయన స్థానంలో డీఈ శ్రీనివాసరాజులకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులకే మళ్లీ ఇక్కడ వెంకటేశ్వర్లును రెగ్యులర్ కమిషనర్‌గా నియమించారు. ఆయన హయాంలో మున్సిపాల్టీలో విభేదాలు తారస్థాయికి చేరా యి. అధికార పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. పాలక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్(వైఎస్సార్ సీపీ)కు సంబంధం లేకుండానే పలు నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ సమావేశాలు కూడా చాలా కాలం నిర్వహించలేదు. ఎట్టకేలకు నిర్వహించినా.. అచ్చం అధికార పార్టీ విధేయునిలా వ్యవహరించారు. ఉద్యోగులు కూడా ఆయన తీరుతో విసిగిపోయారు. నిరసనలు, ఫిర్యాదుల వరకూ వెళ్లారు. చివరికి ఆయన్ను సరెండర్ చేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా పని చేసిన శ్రీనివాసరాజు మీద అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇక్కడ పని చేసిన కమిషనర్ వేధింపులు తాళలేక మహిళా టౌన్ ప్లానింగ్ అధికారిణి ఒకరు వెళ్లిపోయారు. ఇన్ని వివాదాల మధ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిశోర్ కుమార్ కూడా ఎక్కువ కాలం ఆ స్థానంలో పని చేయలేకపోయారు. తాజాగా బదిలీపై వస్తున్న పావని అయినా కొంత కాలం పని చేస్తారో లేదో చూడాలి.


