పది ప్రణాళిక తీరుపై గుర్రు
ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న టీచర్లు
వందరోజుల ప్రణాళికపై ఇతర శాఖల పెత్తనం
విజయనగరం అర్బన్:
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక అమలు తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నియంతృత్వ పోకడలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పదోతరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నూతనంగా అమలులోకి తీసుకొస్తున్న పరీక్షల నిర్వహణ విధానం తలనొప్పిగా మారిందనే విమర్శలు ఉపాధ్యాయుల నుంచి వస్తున్నాయి.
పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పాతర
పరీక్షల క్షేత్రస్థాయి విధులు నిర్వహించే ఇన్విజిలేటర్ నుంచి మూల్యాంకన ప్రక్రియ వరకు అన్ని స్థాయిలలోనూ విధులు కేటాయించే నిర్ణయాలు రాష్ట్రస్థాయి అధికారుల చేతుల్లోనే ప్రభుత్వం ఉంచింది. జిల్లా, క్షేత్రస్థాయి అధికారుల అధికారాలు, రూల్స్ ప్రివిలైజేషన్ ద్వారా సంక్రమించిన విధులు, బాధ్యతలను కూడా రాష్ట్రస్థాయి అధికారులకు ప్రభుత్వం హస్తగతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలు మండల విద్యాశాఖ అధికారుల విధులు, బాధ్యతలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని వాపోతున్నారు. మరోవైపు ఇన్విజిలేటింగ్ విధుల కేటాయింపులో గందరగోళం తప్పదని తెలుస్తోంది. మండలానికి రెండు, మూడు పరీక్షా కేంద్రాలు ఉంటే ఆ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేట్ యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు
అవే కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు ఇన్విజిలేషన్ డ్యూటీలు, బాధ్యతలు వంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ విధానంలో కాకుండా ప్రభుత్వ తాజా ఆలోచనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కేంద్ర కార్యాలయమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రస్థాయి అధికారులే ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తే పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బోధించిన పాఠశాల విద్యార్థులు ఒకే కేంద్రంలో ఉండే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు అవకాశం లేదని వాపోతున్నారు.
ఇతర శాఖల పెత్తనం
మరోవైపు 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణ ఉపాధ్యాయులకు గుదిబండలా తయారైంది. ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు సంబంధం లేని ఇతర శాఖల మండలాల అధికారులను నియమించడం వారికి మింగుడు పడడం లేదు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, వశుసంవర్థక శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్‌లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతోపాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పరిశీలనకు వచ్చిన వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాల్సి ఉంటుంది. షైనింగ్, రైజింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది కూడా తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఏ మాత్రం అవగాహన లేని ఇతర శాఖల అధికారులకు పెత్తనం ఇవ్వడంపై ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


