థర్మాకోల్ షీట్లే బోట్లు..!
మత్స్యకారులకు బోట్లు అందేదెప్పుడు
డిసెంబర్‌లో బోటు షికారు అని మంత్రి హామీ
ఇంకా లబ్ధిదారులను గుర్తించని పరిస్థితి
నీటిమీద రాతలా మంత్రి మాటలు
ప్రమాదపు అంచుల్లో మత్స్యకారులు
సాలూరు రూరల్:
ఆర్భాటంగా హామీలివ్వడం ఆనక ఆచరణ శూన్యంలా తయారైంది ప్రస్తుత గిరిజన, శిశు సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిస్థితి అని నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది. మంత్రి తొలి సంతకం ఏఎన్‌ఎంల నియామకంపై చేసినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అలాగే మున్సిపాలిటీలో మరుగుదొడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఏడాదిన్ననర గడుస్తున్నా ఆ మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ఇటీవల వెంగళరాయ సాగర్‌లో చేపల విడుదల కార్యక్రమంలో తమకు బోట్లు మంజూరు చేయాలని, థర్మాకోల్‌షీట్ పడవలతో చేపలవేటతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని మంత్రికి మత్స్యకారులు విన్నవించుకున్నారు. దీనికియ మంత్రి వెంటనే మత్స్యకారులకు బోట్లు మంజూరుతో పాటు డిసెంబర్ కల్లా బోటు షికారు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అసలు మత్స్యకారులకు బోట్లు లేక చేపల వేటకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బోటు షికారు అంటూ మరో మెట్టు ఎక్కి బోట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తమకు కష్టాలు తీరిపోతాయని చేపల వేటతో పాటు బోటు షికారుతో పర్యాటకుల నుంచి ఆదాయం వస్తుందని ఆశపడిన మత్స్యకారులకు చుక్కెదురైంది. డిసెంబర్ కల్లా బోటుషికారు వచ్చేస్తుందని ఎదురు చూసిన మత్స్యకారులకు ఇంతవరకు చేపల వేటకు అవసరమైన బోట్లు అందలేదు. అసలు ఆ బోట్లు ఎప్పుడు ఇస్తారో కూడా అధికారులు చెప్పడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు.
చేపల వేటకు బోట్లు మంజూరు చేసేముందు ఇప్పటివరకు ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న వారికి బోట్లు మంజూరు చేయాలి. వారిని గుర్తించిన తరువాత బోట్లు కొంటాం. జిల్లాకు 6 ఫిషింగ్ బోట్లు మంజూరయ్యాయి. ఇంకా బోట్లు కొనుగోలు చేయలేదు. పర్యాటక బోట్ల విషయమై ఆ శాఖఅధికారులతో మాట్లాడాల్సి ఉంది. ఫిషింగ్ బోట్లు పర్యాటక బోట్లు వేరుగా ఉంటాయి.
మత్య్స శాఖ ఎ.డి.ఎఫ్ సంతోష్ కుమార్
థర్మాకోల్ షీట్లే బోట్లు..!
థర్మాకోల్ షీట్లే బోట్లు..!


