తూనికల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
● అసిస్టెంట్ కంట్రోలర్ పి.వి. రంగారెడ్డి ● ఆకస్మిక తనిఖీల్లో 19 కేసుల నమోదు ● ఎలక్ట్రానిక్ కాటాల్లో భారీగా తేడాలు గుర్తింపు
సాలూరు: కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో తూనికలు/కొలతల శాఖ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ పి.వి. రంగారెడ్డి నేతత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సాలూరు ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చేపల మార్కెట్, పెద్ద బజార్‌లోని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కిరాణా షాపుల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన ఉల్లంఘనలు. ఎలక్ట్రానిక్ కాటాలపై మోసానికి సంబంధించి 8 కేసులు, నిర్ణీత కాల పరిమితిలో కాటాలకు ప్రభుత్వ ముద్రలు వేయించనందుకు 6 కేసులు నమోదు చేశారు. అలాగే ప్యాకెట్లపై తయారీదారు పేరు, చిరునామా, ధర, తయారీ తేదీ వంటి వివరాలు లేనందుకు 5 కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఒకే రోజులో వివిధ ఉల్లంఘనలపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. వినియోగదారులను తూనికలు, కొలతల్లో మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారస్తులు తూనికలు, కొలతల్లో తేడాలు లేకుండా సరుకులు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పార్వతీపురం లీగల్ మెట్రాలజీ ఇనన్‌స్పెక్టర్ కె.రత్నరాజు, విజయనగరం ఇన్‌స్పెక్టర్ బి.ఉమా సుందరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


