వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి... | - | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి...

Dec 25 2025 8:29 AM | Updated on Dec 25 2025 8:29 AM

వైద్య

వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి...

పాలకొండ రూరల్‌/సాలూరు: వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి తిరుగు ప్రయాణంలో గుండె పోటుకు గురై ఓ వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. ఆ కుటుంబాన్ని ఉన్నపలంగా అంధకారంలోకి తోసేసిన ఘటన పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. మృతుని బంధువులు, స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణ పరిధి జగన్నాథపురంలో నివాసముంటూ కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు నడిపిల్లి జగదీష్‌(40). ఈయన మధుమేహంతో కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో వైద్య సేవలు పొందేందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల బలగ ఆస్పత్రికి వచ్చిపోతుంటారు. ఇదే క్రమంలో ఇటీవల చేయించుకున్న రక్త పరీక్షల ఫలితాలు పోగొట్టుకోవటంతో మరోమారు పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం ఆర్టీసీ బస్సులో శ్రీకాకుళం వెళ్లారు. వైద్య సేవలు, పరీక్షలు పూర్తి చేసుకుని సాయంత్రం తిరుగు ప్రయాణంలో భాగంగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 6 గంటల సమయంలో చేరుకుని పార్వతీపురం బస్సు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాలేజీ పిల్లలు, సహ ప్రయాణికులతో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య గూర్చి వివరించారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోవటంతో అక్కడి వారు గుండెపోటుగా గుర్తించి సహకరించే యత్నం చేశారు. అప్పటికే జగదీష్‌ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆర్టీసీ వర్గాలు, స్థానికుల సమాచారంతో 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా మరణించినట్టు ధ్రువీకరించారు. అప్పటి వరకూ తన ఆరోగ్య సమస్యలు చెబుతూనే తోటి ప్రయాణికుడు ఈ విధంగా మరణించటంతో అక్కడి వారు అయ్యో పాపం.. అంటూ ఆవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాలకొండ పోలీసులు కాంప్లెక్స్‌కు చేరుకుని మృతుని సెల్‌ఫోన్‌ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించారు. ఈయన స్వస్థలం సాలూరు మండలం కూర్మరాజుపేటగా గుర్తించారు. ఈయనకు భార్య సింహాచలం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాలకొండ చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నిబంధనల మేరకు వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వారి కుటంబ సభ్యులకు అప్పగించారు.

వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి... 1
1/1

వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement