బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
కలెక్టర్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం:
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలని, వచ్చేఏడాది జిల్లాలో ఒక్క బాల్య వివాహం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం బాల్యవివాహ నిషేధ చట్టం అమలుపై ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసు గల యువతీ, యువకుల జాబితా ఆయా మండల పరిధిలోని అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే వా రం రోజులు ముందుగా తహసీల్దార్లు, పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో రెవెన్యూ క్లినిక్ నడుస్తోందని, సాధ్యమైనంత వరకు ఎలాంటి భూ తగాదాలు లేకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్, ఏఎస్పీ మనీషా రెడ్డి, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● అవగాహనతోనే డ్రగ్స్ నివారణ సాధ్యం
ప్రజలకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తేనే డ్రగ్స్ నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం, రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీతో కలిసి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మ త్తు పదార్ధాల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. విద్యార్థులను చైతన్యవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషా రె డ్డి, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.
● రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎంపీడీఓ మండలంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రైతుల ఆదాయంను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రైతులు అంతర పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు.


