సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదగాలి
పార్వతీపురం టౌన్: సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా విద్యార్థులు ఎదగాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలని, అపుడే తగిన న్యాయం లభిస్తుందని అన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం మరియు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువులతో మోసపోయినప్పుడు తగిన నష్టపరిహారం పొందవచ్చన్నారు. ఏ వస్తువు కొన్నా కచ్చితంగా బిల్లు తీసుకోవాలని, బిల్లు ఉంటేనే కోర్టులో ఫిర్యాదు చేయడానికి వీలుంటుందన్నారు. అలాగే వస్తువులపై ఐసీఐ, అగ్మార్క్, హాల్ మార్క్ వంటి గుర్తులను చూసి మాత్రమే కొనాలని, ముఖ్యంగా ఆహార పదార్థాలు, మందులు కొనేటప్పుడు తయారీ మరియు గడువు తేదీలను గమనించాలని అన్నారు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న నేటి కాలంలో, కేవలం చదువుకోవడం మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు, యువతకు సూచించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సమాజం పట్ల అవగాహన కలిగి, అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని కోరారు. కార్యక్రమం చివరలో, వినియోగదారుల హక్కుల రక్షణలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్‌రెడ్డి


