బిగ్‌బాస్ విజేత భోగాపురం వాసి
భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం పంచాయతీ మధుర గ్రామం సుందరపేటకు చెందిన పడాల లక్ష్మణరావు, లక్ష్మి దంపతుల కుమారుడు పడాల కళ్యాణ్ సినిహీరో నాగార్జున నిర్వహించిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొని విజేతగా నిలిచాడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కామన్‌మెన్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరి విజేతగా నిలిచి విజయం సాధించిన తొలి ఉత్తరాంధ్ర వాసిగా కళ్యాణ్ గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరిన మొదటలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పట్టువదలకుండా శ్రమించి చివరకు ఫైనల్‌కు చేరి విజేతగా నిలిచాడు. చిన్నప్పటి నుంచి సినీ హీరోగా ఎదగాలనే ఆశ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మూడేళ్లకిందట సీఆర్‌ఫీఫ్ జవాన్‌గా చేరాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు సామాన్యులకు అవకాశం ఉందన్న విషయం తెలుసుకుని దరఖాస్తు చేశాడు. కోట్లాది మంది వీక్షకుల మద్దతుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి 105 రోజుల పాటు సాగిన పోటీలో విజేతగా నిలిచాడు. తుది పోటీలో కళ్యాణ్, తనుజాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో ఎక్కువ మంది ఓట్లువేసి కళ్యాణ్‌ను విజేతగా నిలిపారు. సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ అందుకున్నారు. ట్రోఫీతో తొలిసారి బుధవారం గ్రామానికి వస్తున్న కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ కళ్యాణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


