సీనియర్స్ ఖోఖో పోటీలకు జిల్లా జట్లు పయనం
● 24 నుంచి గుడివాడలో జరగనున్న మహిళ, పురుషుల పోటీలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ మహిళ, పురుషుల ఖోఖో పోటీలకు జిల్లా జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఈ నెల 24 నుంచి 26 వరకు గుడివాడలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సీనియర్ అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు జరగనున్నాయి. జిల్లా జట్లు పోటీలకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా డిగ్రీ కాలేజీలో కోచింగ్ క్యాంప్ ముగించుకొని కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పురుషుల జట్టుకు వజ్రపు శ్రీనివాసరావు, అదే విధంగా మహిళల జట్టుకు సత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం కీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఏఎంఎన్ కమలనాభరావు మాట్లా డుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శనతో విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. సత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యవేణి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, ఉపాధ్యక్షుడు రామారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


