పట్టపగలే గాయత్రీదేవి ఆలయంలో చోరీ
పాలకొండ: నగర పంచాయతీ సమీపంలోని కొండాపురం గ్రామ సమీపంలో ఉన్న పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో చోరి జరిగింది. భక్తుల వేషంలో వచ్చిన భార్యాభర్తలు ఆలయ అర్చకులు ఆలయ మెట్లపై టిఫిన్ చేయడాన్ని గుర్తించారు. అమ్మవారిని దర్శించుకున్నట్టు నటించి గర్భగుడిలోకి ప్రవేశించారు. అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రాలు, కళ్లు తీసుకుని ఆలయం నుంచి హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఇది గమనించిన అర్చకులు చిట్టిబాబు శర్మ అమ్మవారిని చూడగా అమ్మవారి అలంకరణలో చేసిన బంగారు వస్తువులు కనిపించలేదు. వెంటనే కేక వేయగా నిందితులు తాము తెచ్చుకున్న వాహనంపై వుడాయించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్‌ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. దొంగలించిన వస్తువులు సుమారుగా 23 గ్రాములు ఉంటాయని అర్చకులు తెలిపారు. కాగా చోరి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం. వీరు నగర పంచాయతీ పరిధిలోని నక్కలపేటకు చెందిన భార్యాభర్తలుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది.


