ముందస్తు ప్రణాళికలు అవసరం : కలెక్టర్
పార్వతీపురం: అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం పెద్దదైనపుడు అందుకు తగ్గ ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలని, అప్పుడే సామాన్యుల దరికి అభివృద్ధి చేరుతుందన్నారు. మండల ప్రత్యేకాధికారి గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని అభివృద్ధికి ప్రణాళికలు చేయాలన్నారు. జిల్లాలో 15 మండలాలకుగాను 14 మండలాలు ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, పాచిపెంట మండలం బీ గ్రేడ్‌లో ఉందన్నారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని జిల్లా ఉద్యానశాఖాధికారి కలెక్టర్‌కు వివరించారు. మత్య్సశాఖ, ఈ–ఆఫీస్ ఫైలింగ్, ఉద్యానశాఖ తదితర శాఖల పురోగతిపై సమీక్షించారు. సమీక్షలో జేసీ యశ్వంత్ కుమార్‌రెడ్డి, డీఆర్‌వో కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


