దృశ్యం లేదు.. సాక్ష్యం దొరకదు..
పార్వతీపురం రూరల్: ఇంటికొచ్చి తలుపులు బద్దలు కొట్టే రోజులు పోయాయి. దారి కాచి, కత్తులు చూపించి బెదిరించే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు దొంగతనానికి ఆయుధాలు అక్కర్లేదు.. ముఖం చూపించాల్సిన పనే లేదు. ఏడు సముద్రాల అవతల కూర్చుని.. అరచేతిలో ఉండే ఫోన్‌తోనే మన బతుకును అతలాకుతలం చేస్తున్నారు. కంటికి కనిపించకుండానే.. క్షణాల్లో కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఈ నిలువు దోపిడీ ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాను కుదిపేస్తోంది. అమాయకత్వంతో కొందరు, అత్యాశతో ఇంకొందరు, భయంతో మరికొందరు ఈ సైబర్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఇందుకు సాక్ష్యం. అక్షరాలా రూ.22 కోట్లకు పైగా సొమ్ము సైబర్ కేటుగాళ్ల పాలైంది.
సైబర్ కేటుగాళ్ల గారడీ
సైబర్ నేరగాళ్ల తీరు అచ్చు గారడీ విద్యను తలపిస్తోంది. ఊరు, పేరు తెలియని ఈ అదృశ్య నేరగాళ్లు ఎక్కడో ఉండి రెక్కీలు నిర్వహించకుండానే జేబులకు చిల్లులు పెడుతున్నారు. కేవలం ఒకే ఒక్క లింక్‌తో జీవితాన్ని తలకిందులు చేస్తున్నారు. ఏదో ఒక బహుమతి వచ్చిందనో, కరెంట్ బిల్లు కట్టలేదనో, లోన్ ఇస్తామనో మెసేజ్‌లు పెట్టి, మాటల మాంత్రికుల్లా మాయచేసి ఆ లింకులు క్లిక్ చేయిస్తున్నారు. లేదా ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయించి ఫోన్‌ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కళ్లు మూసి తెరిచే లోపే, బ్యాంకు ఖాతాలోని సొమ్మును ఊడ్చేస్తున్నారు.
ఉద్యోగులు సైతం
చదువు రాని వారే మోసపోతారనుకుంటే పొరపాటే. సమాజానికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, డబ్బు లెక్కలు చూసే బ్యాంకు ఉద్యోగులు సైతం ఈ వర్చువల్ వలలో చిక్కుకుంటున్నారు. ఇటీవల బొబ్బిలికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా రూ.22.18 లక్షలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యువత, మహిళలు, ఉద్యోగులే వీరి ప్రధాన లక్ష్యం. ఒకపక్క సైబర్ నేరాలు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంటే, వాటి విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. 2023 నుంచి నమోదైన కేసుల్లో కేవలం పది మాత్రమే కోర్టు మెట్లెక్కాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 28 కేసుల్లో సరైన ఆధారాలు దొరకలేదని ఛార్జిషీట్లు మూసేశారు. మిగిలిన వాటిపై విచారణ సాగుతూనే ఉంది. ఈ గణాంకాలు బాధితుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
డిజిటల్ అరెస్ట్ అనే భూతం!
ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే భూతాన్ని తెరపైకి తెచ్చారు. సీబీఐ, ఈడీ, పోలీసులమంటూ వీడియో కాల్ చేసి, నీ ఆధార్‌తో డ్రగ్స్ పార్శిల్ వెళ్తోంది.. మనీ లాండరింగ్ జరిగింది అని బెదిరించి, గదిలో బంధించినట్టు భ్రమింపజేసి రూ.లక్షలు లాగేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేదే చట్టంలో లేదు. అది కేవలం భ్రమ మాత్రమే అని పోలీసులు నెత్తి నోరు బాదుకుంటున్నా, జనం మాత్రం భయంతో డబ్బులు సమర్పించుకుంటున్నారు.
ఈ మాయగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే ఆయుధం. వాట్సాప్, మెసేజ్‌లలో వచ్చే అనవసరపు లింకులు, అస్సలు క్లిక్ చేయకూడదు. ప్లే స్టోర్ కాకుండా బయటి నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేశారో.. మీ ఫోన్ వారి చేతికి ఇచ్చినట్లే. ఎవరైనా వీడియో కాల్ చేసి అరెస్ట్ చేస్తామంటే ధైర్యంగా కట్ చేయాలి. ముఖ్యంగా మీ ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పిన్ నెంబర్లు ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ పొరపాటున డబ్బులు పోయిన వెంటనే తేరుకుంటేనే రికవరీకి అవకాశం ఉంటుంది.
జిల్లాలో సైబర్ నేరాల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మోసగాళ్లు వాడుతున్న కొత్త పద్ధతులపై జాగ్రత్త వహించాలి. సైబర్ నేరగాళ్లు మరొకరి వలె నటించడం ద్వారా వంచన చేస్తున్నారు. నకిలీ కస్టమ్స్, సీబీఐ లేదా పోలీసు అధికారులమని వేషం వేసి, వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెడుతున్నారు.అందుకే, అపరిచితుల కాల్స్‌కు స్పందించవద్దు. ముఖ్యంగా బెదిరించే కాల్స్‌ను నమ్మకూడదు. ఎవరికీ మీ వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీల వివరాలను, ఓటీపీలను చెప్పవద్దు. మోసపోయినట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 నెంబరుకు కాల్ చేసి, సైబర్క్‌రైమ్.జివోవి.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
–బి రవీంద్ర రాజు, సైబర్ సెల్ ఎస్‌ఐ,
పార్వతీపురం మన్యం జిల్లా
లింకులతో లంకె.. ఖాతాలకు గాలం!
కూర్చున్న చోట నుంచే రూ.కోట్లు కొల్లగొడుతున్నారు
ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో రూ.22 కోట్లు హాంఫట్
డిజిటల్ అరెస్టు పేరుతో సరికొత్త దడ
సైబర్ వలలో చిక్కుకుంటున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు
గత మూడేళ్లలో 380 కేసులు
మోసపోయామని తెలిసిన వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయడం లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయడం ఒక్కటే మన సొమ్మును కాపాడే మార్గమని సైబర్ సెల్ అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ ఆలస్యం అమృతం విషం కాదు.. ఆలస్యం అర్థం (డబ్బు) వ్యర్థం!
దృశ్యం లేదు.. సాక్ష్యం దొరకదు..
దృశ్యం లేదు.. సాక్ష్యం దొరకదు..


