వైఎస్సార్‌సీపీ శ్రేణుల జోలికొస్తే సహించేది లేదు..
సాలూరు: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసిన తాను ఎల్లప్పుడూ హుందా రాజకీయాలే చేశానని అటువంటి తనపై, మా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై మంత్రి సంధ్యారాణి చుట్టూ ఉన్న కొందరు కోవర్టులు తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని వారెవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తిలేదని, వారు నాలో మరో కోణాన్ని తప్పక చూస్తారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు. పట్టణంలో ఆదివారం మాట్లాడుతూ, సదరు టీడీపీ నేతల పోస్టింగ్‌లు భద్రపరుస్తున్నామని, డిజిటల్ బుక్‌లో సేవ్ చేస్తున్నామని తెలిపారు. వారెవ్వరిని వదిలిపెట్టబోమని, రాజన్నదొరలో మరో కోణాన్ని తప్పక వారు చూస్తారని హెచ్చరించారు. గతంలో ఏనాడు లేని విధంగా మంత్రి సంధ్యారాణి అనుచర వర్గం వలన పలువురు మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయాలను మనం ఇటీవల చూశామని వివరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ నియోజకవర్గంలో జరగలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందన్నారు. మంత్రి పీఎస్‌పై బాధిత మహిళ ఫిర్యాదు చేసిన క్రమంలో ఆధారాలు ఫోరెన్సిక్‌కు పంపి ఇన్ని వారాలవుతున్నా నేటికి తదుపరి చర్యలు లేకపోవడం వలన కేసు తారుమారు చేస్తారేమోనని ప్రజల నుంని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఏం చేసుకుంటావో చేసుకో, నేను మంత్రి సంధ్యారాణి మనిషినని ఇటీవల బంగారమ్మ కాలనీలో ఓ టీడీపీ నేత చెప్పాడని ఓ బాధిత మహిళ తెలిపిందన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని, తన పీఎస్ నాగరాజుపై మంత్రి డ్రైవర్ అసభ్య పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టినా పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తామే చేయించామని మంత్రి సంధ్యారాణి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో తానెప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని, ఎవరి జోలికి వెళ్లలేదని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు నేను విధేయుడునేనని స్పష్టం చేశారు. కొందరు టీడీపీ రౌడీలు, గూండాలపై పోలీసులు చర్యలు తీసుకుని వారి ప్రవర్తనపై కఠినంగా ఉండాలన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల జోలికొస్తే సహించేది లేదని పునరుద్ఘాటించారు.
రాజన్నదొరలో మరో కోణాన్ని చూస్తారు...
నేనెప్పుడూ ప్రజలకు విధేయుడినే..
తప్పుడు పోస్టింగ్‌లు చేస్తున్న వారి వివరాలు డిజిటల్ బుక్‌లో నమోదు
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర


