కురుపాంకు కూతవేటు దూరంలో గజరాజులు
కురుపాం: కొన్నేళ్లుగా ఏజెన్సీ మన్యంలో తిష్ట వేసిన గజరాజుల గుంపు ఆదివారం కురుపాం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి. సమీపంలోని పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత అటవీ శాఖ అధికారులు గజరాజుల సంచారంపై ముందస్తు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తుండడంతో ఎప్పుడు ఎక్కడ గజరాజులు తిరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని, ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తమ ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం ఫోర్ట్: ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించా లని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సుమారు 2 లక్షల మంది పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. తొలి రోజు పోలింగ్ కేంద్రాల్లో పోలి యో చుక్కలు వేయడంతో పాటు, 22 నుంచి 23 వరకు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. 24వ తేదీన పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యే క దృష్టి పెట్టామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.జీవనరాణి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్‌కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని సూచించారు. మండల, డివిజన్ అధికారుల కార్యాలయంలో కూడా పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని ఆదేశించారు.
కురుపాంకు కూతవేటు దూరంలో గజరాజులు


