జనవరి 4న చలో విశాఖ
బొబ్బిలిరూరల్: ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే ఏడాది జనవరి 4న ఆర్కేబీచ్‌లో నిర్వహిస్తున్న సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు పిలుపునిచ్చారు. పిరిడి పీహెచ్‌సీలో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎం, వైద్యసిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 29 లేబర్ చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ అమలుచేస్తూ కోట్లాదిమంది కార్మికుల శ్రమదోపిడీకి మోదీ ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. చలో విశాఖను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాలో 29 స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు 29 నమోదైనట్టు డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనకుమారి తెలిపారు. 194 మందిని పరీక్షించగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. పీహెచ్‌సీల్లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ల్యాబ్‌లో ఎలిజా టెస్టు ద్వారా నిర్ధారిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యాధి సోకినవారంతా ఆరోగ్యంగానే ఉన్నారన్నారు.


