
ర్యాగింగ్‌కు పాల్పడి జీవితం నాశనం చేసుకోవద్దు
విజయనగరం క్రైమ్: జిల్లాలో వివిధ ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఇతర కళాశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు సిబ్బందిని బుధవారం ఆదేశించారు.ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ కొన్ని సూచనలు, ఆపై జాగ్రత్తలను సిబ్బందికి, స్టూడెంట్స్‌కు జారీ చేశారు. ర్యాగింగ్ వల్ల కలిగే దుష్ప్‌ప్రభావాలను విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. తమ పరిధిలోగల ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలు, ఇతర విద్యాలయాలను సందర్శించి, విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పభ్రావాలను వివరించాలని చెప్పారు. సీనియర్ విద్యార్థులు తోటి విద్యార్థుల పట్ల శృతిమించి ప్రవర్తిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాలని సూచించారు. ర్యాగింగుకు పాల్పడిన విద్యార్థులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫలితంగా అర్ధాంతరంగా చదువు, కెరీర్ నాశనం అవుతాయన్న విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలని హితవు పలికారు.
ఎస్పీ వకుల్ జందల్ హితవు