
అర్జీదారుల సమస్యలు అర్థం చేసుకోవాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
● పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారులతో సమీక్ష
విజయనగరం అర్బన్: తమ సమస్యలు, బాధలు తీరుతాయనే అర్జీదారులు పీజీఆర్‌ఎస్‌కు వస్తారని, వాటిని అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన సేవ అని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ పేర్కొన్నారు. అర్జీదారుల పట్ల సానుకూలంగా వ్యవహారం ఉండాలని దరఖాస్తులో వాస్తవికత ఉంటే పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారులతో అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అర్జీల పరిష్కారం ద్వారా ఒకరి సమస్య తీర్చడమే నిజమైన సేవగా భావించాలని హితవు పలికారు. అర్జీలకు సమాధానాలు రాసేటప్పుడు స్వీకింగ్ అర్డర్ మాదిరి ఉండాలని ఏది అడిగారో దానికోసమే సమాధానం రాయాలని అయితే సమాధానం రాసిన తర్వాత అర్జీదారు సంతృప్తి చెందేలా ఉండాలని ఎట్టి పరిస్థితిల్లోనూ రీ ఓపెన్ కాకూడదని తెలిపారు.
బాధ్యత గల ఉద్యోగిని కలెక్టరేట్‌కు పంపాలి
అర్జీలను ఎలా పరిష్కరించాలో జిల్లా అధికారులు వారి స్టాఫ్‌కు ప్రతి సమావేశంలోనూ అవగాహన కలిగించాలన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రతి కార్యాలయం నుంచి ఒక బాధ్యత గల ఉద్యోగిని డిజిగ్నేట్ చేసి వారిపేరును కలెక్టరేట్‌కు పంపాలని సూచించారు. ఆర్జీల కోసం ప్రతి రోజు లాగిన్‌లో చూడాలని అలాగే సాయంత్రం వెళ్లేటప్పుడు కూడా చూడాలని తెలిపారు. ఏ టైమ్‌లో నైనా చూడకుండా ఉన్న అర్జీలు సున్నా కనపడాలని స్పష్టం చేశారు. అర్జీ అందగానే అర్జీదారుతో ముందు మాట్లాడాలని తన సమస్య ఏంటో తెలుసుకుని సమాధానం రాయాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పీజీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా ఉంటే ఆ అధికారి సీఆర్‌లో నెగటివ్‌గా రాయనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో అధనపు ఎస్‌పీ సౌమ్యలత, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా అధికారులు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.