ప్రయాణానికి చింతే.. | - | Sakshi
Sakshi News home page

ప్రయాణానికి చింతే..

Sep 4 2025 6:25 AM | Updated on Sep 4 2025 6:25 AM

ప్రయాణానికి చింతే..

ప్రయాణానికి చింతే..

ప్రయాణానికి చింతే..

మన్యం ప్రజలను వీడని వరద కష్టాలు

నదులు, గెడ్డలు పొంగితే రాకపోకలు బంద్‌

విద్యార్థులకు, గ్రామస్తులకు తప్పని ఇబ్బందులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

ర్షం కురిస్తే చాలు.. మన్యం ప్రజలు వణుకు తారు. నదులు, వాగులు దాటి స్కూల్‌కు వెళ్లిన చిన్నారులు.. కూలి పనులకు వెళ్లిన పెద్దలు తిరిగి ఇంటికి చేరేవరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతా రు. ఇక్కడ చినుకు రాలినా.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా వారికి భయమే. సరైన రహదారు లు లేక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ ప్రయాణాలు చేయడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. చాలా వరకు నదులపై వంతెనలు లేకపోవడం, చిన్నపాటి వరదలకే కల్వర్టులు, కాజ్‌వేలు కొట్టుకుపోవడంతో ప్రధానంగా గిరిజనులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. గర్భిణులు, రోగులను డోలీలు కట్టి, వాగుల మీదుగా తీసుకెళ్లిన ఘటనలు అనేకం. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 50 వరకు వంతెనలు, కాజ్‌వేలు, కల్వర్టులు అవసరమని గిరిజన సంక్షేమశాఖ అధికారుల అంచనా. నిధులు లేక మధ్యలోనే ఆగిపోతున్నవి కొన్ని వారధులు కాగా.. నిధులు కోసం చూస్తున్నవి మరికొన్ని ఉన్నాయి.

●ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 96 కిలోమీటర్ల మేర నాగావళి ప్రవహిస్తోంది. ఎగువన వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తే ఆవలున్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు సాగించే క్రమంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. గతేడాది పాచిపెంట మండలం కొటికిపెంట ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు గెడ్డ దాటుతుండగా ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పశువులు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి.

●కురుపాం మండలం గొట్టివాడ గ్రామస్తులు మార్గమధ్యంలోని బోరిగెడ్డ దాటి ఏ పనికై నా ఇటు రావాల్సిందే.

●సీతంపేట మండలం రేగులగూడ–వెంపలగూడ మధ్య ప్రయాణం వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతోంది. వానలు కురిస్తే వాగు పొంగి, సమీప ప్రాంతాలకు రాకపోకలు తెగిపోతున్నాయి.

●భామిని మండలం కొరమ సమీపంలోని బగ్గామర్రిపాడు గెడ్డపై ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన 2002లో కూడిపోయింది. తర్వాత ప్రత్యామ్నాయంగా రూ.16 లక్షల వ్యయంతో కాజ్‌వే నిర్మాణం చేపట్టారు. భారీ వర్షాలు కురిస్తే వాగు ఉద్ధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

●మెంటాడ మండలం జగన్నాథపురం వద్ద చంపావతి నదిపై నిర్మించిన కల్వర్టు వర్షాల సమయంలో కొట్టుకుపోవడం సాధారణంగా మారింది. ప్రస్తుతం కూడా వర్షాలకు నది ప్రవాహం ధాటికి దెబ్బతింది. దీంతో జగన్నాథపురం, చాకివలస గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

●ఒడిశాలో వర్షాలు కురిస్తే సాలూరు నియోజకవర్గంలో సువర్ణముఖి నది ఉద్ధృతి పెరిగి సమీప గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్‌ అవతున్నా యి. దండిగాం వద్ద గతంలో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఇక్కడి కాజ్‌వే స్థానంలో డబుల్‌ రోడ్డుతో కూడిన వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఎండీఆర్‌ ప్లాన్‌ కింద రూ.8 కోట్లు మంజూరు చేయించారు. పనులు ప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వం మారడంతో ముందుకు సాగలేదు. అనంతర కాలంలో వంతెన పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల దండిగాం, కురుకూటి, సొంపి గాం, డెన్సరాయి తదితర పంచాయతీల్లోని సుమా రు 20కిపైగా గిరిజన గ్రామాల ప్రజలు వర్షాకాలం సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సువర్ణముఖి నది దాటుతున్నారు. సాలూరు మండలంలోని పెద్దపారన్నవలస గ్రామంలోని కూరగెడ్డపై కూడా నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ సందివలస గ్రామం నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే గెడ్డ దాటాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విద్యార్థులు భయంభయంగానే వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement