
నిరుద్యోగుల నిరీక్షణ
● ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ
భృతి ఇస్తామన్న చంద్రబాబు
● ఇంకా అమలు కాని హామీ
● ఆశగా ఎదురు చూస్తున్న యువత
రామభద్రపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రతి ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాగంగా సూపర్ సిక్స్‌లో పథకాల్లో నిరుద్యోగ భృతిని మొదటి హామీగా పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా..ఈ హామీ ఇంకా అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఇంట్లో నిరుద్యోగులు చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారా? అసలు చేస్తారా? చేయరా? చేస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఇంటికో ఉద్యోగం ఇస్తారా? ఒకవేళ నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు? వంటి సందేహాలతో యువత సతమతమవుతున్నారు.అసలు ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు.
సందిగ్ధంలో నిరుద్యోగులు..
2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ అప్పడు కూడా ఎన్నికల ప్రచారంలో జాబు కావాలంటే..బాబు రావాలి,ఇంటికో ఉద్యోగం లేదంటే ప్రతి నెల రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చింది. కానీ ఎక్కడా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొండిచేయి చూపారు. గత అనుభవంతో ఈ సారైనా హామీ అమలు చేస్తారా? లేదా మొండి చెయ్యి చూపిస్తారా? అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు కార్యదర్శులు, వలంటీర్లుగా నియమించిన విషయం తెలిసిందే. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏమేరకు ఉద్యోగాలు కల్పిస్తుందోనని యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నత చదువులు అభ్యసించారు. నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారు.కూటమి ప్రభుత్వం నేటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.