
భూగర్భ జలాల స్థాయి జిల్లాలో పెరగాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
విజయనగరం అర్బన్: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచే మార్గాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో భూగర్భ జలాల స్థాయిలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు దోహద పడే ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలను, ఫారం పాండ్స్‌ను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమయ్యే మంజూరులను తీసుకుని ప్రతిపాదనలను పంపాలని చెప్పారు. జిల్లాలో 3 మీటర్ల లోపల 17 మండలాల్లో, 3 నుంచి 8 మీటర్లలోపు 9 మండలాల్లో, 8 మీటర్ల లోతులో 2 మండలాల్లో భూగర్భజలాల స్థాయి ఉందన్నారు. అయితే జిల్లా సరాసరి 3.80 మీటర్లలోపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో బాపట్ల సరాసరి 3.7 మీటర్ల లోతులో ఉంటూ మొదటి స్థానంలో ఉందని, విజయనగరం 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 215 గ్రామాల్లో భూగర్భ నీటి స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ గ్రామాల్లో భూగర్భ నీటిస్థాయిని పెంచడానికి వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. జలవనరుల శాఖ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లను క్లీనింగ్ చేయాలని వచ్చే 4 రోజుల్లో 174 చెరువులను పరిశుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, ఇరిగేషన్ ఈఈ రమణ, గ్రౌండ్ వాటర్ డీడీ దినకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిందాల్ సమస్యలపై గ్రామసభ
జిందాల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎస్.కోట మండలం మూల బొడ్డవర గ్రామంలో బుధవారం కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ వద్ద నున్న డాక్యుమెంట్ల ఆధారాలతో గ్రామ సభకు హాజరు కావాలని సూచించారు. న్యాయపరంగా రికార్డు పరంగా కచ్చితంగా ఉన్న వారికి అక్కడికక్కడే పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. లేని వారికి కారణాలను తెలియజేయనున్నామని పేర్కొన్నారు. ఈ గ్రామ సభకు తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులు రికార్డులతో హాజరవుతారని అదేవిధంగా జిందాల్ కంపెనీ వారు కూడా రికార్డులతో హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.