
స్వమిత్వతో కచ్చితమైన భూ రికార్డులు
పార్వతీపురం రూరల్: స్వమిత్వ సర్వేతో కచ్చితమైన భూ రికార్డులను అందించడం జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. పార్వతీపురం మండలం జమదాల పంచా యతీ లక్ష్మీపురం గ్రామంలో అమలవుతున్న స్వమిత్వ యోజన పథకాన్ని సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి మంగళవారం పరిశీలించారు. బందలుప్పి, జమదాల సమీపంలోని చెరువులను కలెక్టర్ పరిశీలించారు. ఎర్రంనాయుడు చెరువు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఆయన వెంట డీపీఓ కొండలరావు, తహశీల్దార్ సురేష్ ఉన్నారు.
పది కిలోల గంజాయి స్వాఽధీనం
శృంగవరపుకోట: ఎస్.కోట పట్టణ పోలీసులు మంగళవారం బొడ్డవర కూడలిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు లగేజీ బ్యాగ్‌లతో పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 7 ప్యాకెట్లలో 10కిలోల గంజాయి లభించింది. నిందితులు బెంగుళూరు సమీపంలోని తిరుమలశెట్టి గ్రామానికి చెందిన చరనా దారి, పవన్ మంజూనాథ్‌లుగా గుర్తించారు. వీరు అరకు నుంచి కర్ణాటక రాష్ట్రానికి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుపడ్డారు. కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
పేదల బియ్యం పట్టివేత
మక్కువ: మండలంలోని ఎర్ర సామంతవలస గ్రామం వద్ద మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారుల సంయుక్తంగా దాడిచేసి పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. మక్కువకు చెందిన ఓ వ్యక్తి ఆటోలో ఎర్రసామంతవలస మీదుగా ఒడిశా తరలిస్తున్న 950 కేజీల బియ్యంను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు.
బ్యాంకు ఖాతా నుంచి రూ.8లక్షలు చోరీ
● వైద్య ఖర్చుల కోసం దాచిన డబ్బును దోచుకున్న సైబర్ నేరగాళ్లు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని గెంబలి వారి వీధికి చెందిన బరాటం బాలకృష్ణమూర్తి అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి అతని ప్రమేయం లేకుండా రూ.8 లక్షలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ కె.మురళీధర్ కేసు నమో దుచేశారు. వైద్య ఖర్చుల కోసం దాచిన సొమ్మును తీసుకునేందుకు సోమవారం బ్యాంకుకు వెళ్లగా గతనెల 28న తన ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో విత్ డ్రా చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వింతవ్యాధితో
లక్షకు పైగా కోళ్లు మృతి
● నమూనాలు విజయవాడ ల్యాబ్‌కు
తరలింపు
కొత్తవలస: వింత వ్యాధులతో దేశవాళీ, ఫారం కోళ్లు మృత్యవాత పడుతున్నాయని పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు కన్నంనాయుడు మంగళవారం తెలిపారు. కొత్తవలస పశు సంవర్థక శాఖ సబ్‌డివిజన్ పరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట మండలాల పరిధిలో నేటి వరకు లక్ష వరకు కోళ్ల మృతి చెందినట్టు వెల్లడించారు.
రెండు మండలాల్లో 80కి పైగా కోళ్ల ఫామ్‌లు ఉన్నాయని, గత నెల రోజుల నుంచి వరుసగా కోళ్లు చనిపోవడం ప్రారంభమైందన్నారు. కోళ్లఫామ్‌ల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని, కోళ్లకు సోకిన వ్యాధి నిర్ధారణకు నమూనాలను విజయవాడ ప్రత్యేక ల్యాబ్‌కు పంపించామన్నారు. చనిపోయిన కోళ్లను ఆరుబయట వేయకుండా గొయ్యితీసి పాతిపెట్టాలని సూచించారు. ల్యాబ్ ఫలితాలు వస్తేగాని వ్యాధి నిర్ధారణ చేయలేమన్నారు.

స్వమిత్వతో కచ్చితమైన భూ రికార్డులు