
అన్నదమ్ముల మధ్య మద్యం చిచ్చు
● మద్యం సేవించి వస్తుండగా ఇద్దరి మధ్య గొడవ
● అన్నపై కత్తితో తమ్ముడి దాడి
● ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి
● కొత్తబగ్గాంలో దారుణం
● కేసు నమోదుచేసిన పోలీసులు
గజపతినగరం రూరల్: మద్యం మహమ్మారి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. ఆ మత్తులో కత్తితో దాడికి ఉసికొల్పింది. ఒకరి హత్యకు కారణమైంది. గజపతినగరం మండలం కొత్తబగ్గాంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో అన్నపై తమ్ముడు కత్తితో దాడిచేయడంతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పసుపురెడ్డి శ్రీను, చంటి అన్నదమ్ములు. ఇద్దరి మధ్య ఏడేళ్ల నుంచి మాటలు లేవు. మంగళవారం రాత్రి అన్నదమ్ములిద్దరూ తమ స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. అందరూ కలిసి ఇంటికి వస్తుండగా మద్యం మత్తులో చంటిని శ్రీను వ్యంగంగా విమర్శించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఆ క్రమంలో శ్రీనుపై చంటి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన శ్రీనును గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

అన్నదమ్ముల మధ్య మద్యం చిచ్చు