భామిని: మండలంలోని తాలాడ సమీప ఐలమ్మ తోటలో ఏనుగులు సంచరించిన ప్రాంతాలను విశాఖ ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జిల్లా పారెస్ట్ ఆదికారి జీఏపీ ప్రసూనల బృందం సోమవారం పరిశీలించింది, ఐలమ్మ తోట పక్కనే గల వంశధార నది తీరాన్ని కూడా సందర్శించారు. గడిచిన మూడేళ్లుగా వంశధార నదీ తీరంలో ఏనుగుల గుంపు ఎలా గడిపిందని మాత్రమే పరిశీలించారు. కూటమి నాయకులు చెబుతున్నట్లు గత మూడేళ్లుగా ఏనుగుల గుంపుతో రైతుల పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి కాని, కుంకి ఏనుగులు తెచ్చి తరలించేందుకు చర్యలు తీసుకోవడం కోసం కానీ ఫారెస్టు అధికారులు చర్చించలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఏనుగుల బెడద లేకపోయినా వాతావరణం మారగానే తిరిగి వస్తాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఎందుకు నివాసముంటోందనని ఆలస్యంగా ఆటవీ శాఖాదికారులు పరిశీలించడం ఆశ్చర్యం కలిగించింది. కన్జర్వేటర్ శాంతి ప్రియ పాండేకు ఎలిఫెంట్ రేంజర్ మణికంఠేశ్వరరావు ఏనుగుల జాడలు వివరించారు. పాలకొండ రేంజర్ రామారావు,కొత్తూరు సెక్షన్ అధికారులు దాలినాయుడు, రామకృష్ణ, కేశవ, ట్రాకర్స్ ఉన్నారు.