
కాకి లెక్కలు..!
తీర్మానానికే స్పందన శూన్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో గిరిజన, భూ సమస్యలపై అనేక వినతిపత్రాలిచ్చామని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఒక్కటీ పరిష్కారం కాలేదని సీపీఎం నేత రాము చెబుతున్నారు. తాను ఒక్కడినే 40 వరకు వినతిపత్రాలందించానని.. అందులో దేనికీ మోక్షం కలగలేదని చెప్పారు. ఏదో న్యాయం జరుగుతుందన్న ఆశతో గిరిజనులు వస్తున్నారని.. ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని తెలిపారు.
ఈమె పేరు పువ్వల శోభ. కొమరాడ మండలం. కొన్నాళ్ల కిందట ఆమె భర్త చనిపోయారు. వితంతు పింఛన్ కోసం కొద్ది నెలలుగా ఆమె దర ఖాస్తు చేసుకుంటోంది. మండలంలో అధికారుల చుట్టూ తిరిగింది. ఇప్పటికే రెండు దఫాలు పీజీఆర్‌ఎస్‌లోనూ వినతిపత్రం అందించింది. నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. ఒంటరి మహిళనైన తనకు పింఛను ఇచ్చి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం:
పేరుకే.. ప్రజాసమస్యల పరిష్కార వేదిక! ఒక్కటైనా పరిష్కారానికి నోచుకున్న దాఖలాలు లేవు. పదేపదే తిరిగి అర్జీదారులు విసిగిపోవాలే గానీ.. అధికారులకు పీజీఆర్‌ఎస్ వినతులంటే చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. ఈ మాటలంటున్నవి స్వయంగా ప్రజలు, ప్రజాసంఘాల నాయకులే. ఏడాది కిందట ఇచ్చిన వినతులకు నేటికీ మోక్షం కలగడం లేదు. పింఛన్లు, భూమస్యలు, రెవెన్యూపరమైన అంశాలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక, వ్యక్తిగత సమస్యలు.. ఇలా ఏదైనా సరే విజ్ఞప్తులు బుట్టదాఖలు కావాల్సిందే అంటూ వాపోతున్నారు.
విజ్ఞప్తులు వేలల్లో.. పరిష్కారం?
ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు.. ఆచరణలో నీరుగారిపోతున్నాయి. ఏదైనా సమస్యను పరిష్కరించలేని యెడల సహేతుకమైన కారణాన్ని, దరఖాస్తుదారులకు అర్థమయ్యేరీతిలో వివరించాలని కలెక్టర్‌తోపాటు, ఇతర ఉన్నతాధికారులు చెబుతున్నారు. కిందిస్థాయిలో ఒక అంశంపై పదేపదే తిరిగినా న్యాయం జరగకపోవడంతోనే అర్జీదారులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. ఇక్కడ వారి సమస్యను వింటున్న అధికారులు.. మరలా జిల్లా అధికారులు, మండలాలకే పంపుతున్నారు. వారేమో, అసలు పరిశీలించకుండానే పరిష్కరించేసినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసేస్తున్నారు. అంకెల్లో అంతా బాగున్నట్లే అని చూపించేస్తున్నారు. తమ విజ్ఞప్తి ఏమైందో తెలియక.. ప్రజలు నమ్మకంతో మళ్లీమళ్లీ వచ్చి వినతిపత్రాలు అందిస్తున్నారు. పీజీఆర్‌ఎస్ వినతుల పరిష్కారంపై గిరిజన సంక్షేం సంఘం నాయకులు పాలక రంజిత్‌కుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా, అధికారులు ఇచ్చిన అంకెలు.. కాకి లెక్కలను తలపించడం విశేషం. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ నాటికి జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 44,919 వినతులు అందాయి. అందులో 44,384 వినతులను పరిష్కరించేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 535 వినతులు పెండింగులో ఉన్నట్లు చూపుతున్నారు. తామే అనేక సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించామని.. అందులో ఒక్కటీ పరిష్కారం కాలేదని.. చిత్తశుద్ధిలేని కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకని గిరిజన సంఘ నేత రంజిత్‌కుమార్‌తో పాటు, పలు ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
వీరంతా గుమ్మలక్ష్మీపురం మండలం రాయఘడ జమ్ము పంచాయతీకి చెందిన మహిళలు. పెంగువ గ్రామంలో ఉన్న డీఆర్ డిపోను ఇప్పటి వరకు సరస్వతీ మహిళా సంఘం వారు నడుపుతున్నారని.. వారి కాల పరిమితి అయిపోవడంతో పీసా గ్రామ సభ నిర్వహించి, ఇకపై సీతాదేవి మహిళా సంఘానికి అప్పగించాలని సభ్యులంతా తీర్మానించుకున్నారు. ఆ మేరకు అధికారులను కలిసి తమ తీర్మాన ప్రతులను అందజేశారు. ఫలితం లేదు.. గతంలో ఓ సారి కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. స్పందన లేకపోవడంతో మరోసారి పీజీఆర్‌ఎస్‌లో విజ్ఞప్తి చేశారు.

కాకి లెక్కలు..!

కాకి లెక్కలు..!