
సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ప్రథమస్థానం
బొబ్బిలిరూరల్: గుంటురు జిల్లా సత్తెన పల్లి లయోలా కళాశాలలో శని, ఆదివారాల్లో జరిగిన 12వ అంతర్‌జిల్లా మహిళా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన మహిళల జట్టు ప్రథమ స్థానం సాధించిందని పారాది జెడ్పీహెచ్‌ఎస్ పీడీలు నల్ల వెంకటనాయుడు, సత్యనారాయణ తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్న జట్టుకు, శిక్షణ ఇచ్చిన పీడీలకు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబినాయన అభినందనలు తెలిపారు.
రంగరాయపురంలో
చేతబడి కలకలం
లక్కవరపుకోట: మండలంలోని రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చేతబడి కలకలం రేపింది. శనివారం రాత్రి గ్రామంలో ఓ ఇంటి ముందు ముగ్గులు వేసి మనిషి ఆకారంలో బొమ్మను తయారు చేసి మధ్యలో పెట్టి నిమ్మకాయలకు పసుపు, కుంకం రాసి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు. ఈ విధంగానే గత వారంలో కూడా ఒక వీధిలో చేశారని గ్రామస్తులు తెలిపారు. మరో ఇంటి వద్ద తాము లేని సమయంలో ద్వారబంధాల వద్ద నువ్వులు, నిమ్మకాయలను వేశారని ఆ ఇంటి యజమాని తెలిపారు. అలాగే జమ్మాదేవిపేట గ్రామంలో ఒక వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని ద్వారబంధాల వద్ద నల్ల నువ్వులను సుమారు 3కేజీలకు పైగా పోసి ఉన్నట్లు గుర్తించామని ఇంటి యజమానులు వాపోయారు. మండలంలో వరుసగా ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఈ తరహా వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.
పశువుల వ్యాన్ల సీజ్
దత్తిరాజేరు: మండలంలోని మరడాం కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు పశువుల వ్యాన్లు పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్. బూర్జవలస ఎస్సై జి.రాజేష్ ఆదివారం తెలిపారు. రాత్రి వేళల్లో వారపు తనిఖీల్లో భాగంగా ఆండ్ర ఎస్సై సీతారాం తనిఖీలలో భాగంగా పట్టుకున్నట్లు చెప్పారు.సరైన పత్రాలు లేకుండా పశువులను అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
భవనంపై నుంచి పడి కార్మికురాలి మృతి
కొమ్మాది(విశాఖ): జీవీఎంసీ 8వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి జారిపడి ఓ కార్మికురాలు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, గొలగాం గ్రామానికి చెందిన చందక సత్యాలు (48), భర్త సింహాచలంతో కలిసి మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చారు. వారు ఆరిలోవలోని తోటగరువు వద్ద నివాసం ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. రుషికొండలోని తారకరామ లేఅవుట్‌లో గల ఆదిత్య అపార్ట్‌మెంట్ వెనుక నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద వారు కూలి పనులు చేస్తున్నారు. ఆదివారం మూడో అంతస్తులో శ్లాబ్ నిర్మాణం జరుగుతుండగా, పనిలో భాగంగా పైనున్న సత్యాలు కళ్లు తిరిగి మొదటి అంతస్తు శ్లాబ్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ప్రథమస్థానం