
ప్రతీ రోజు వినతులు అందజేయవచ్చు..: కలెక్టర్
పార్వతీపురం రూరల్: ప్రతీ రోజు ప్రజలు తమ సమస్యలపై వినతులను అందజేసేందుకు కలెక్టరేట్ సెల్లార్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, అలాగే ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదులపై అర్జీలు అందజేయవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఆన్‌లైన్‌లో మీకోసం వెబ్‌సైట్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో(పీజీఆర్‌ఎస్)లో వివరాలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. వచ్చిన అర్జీల వివరాలను టోల్‌ఫ్రీ నంబరు 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.
నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నారు. ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్ హాజరు కానున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపారు.
మడ్డువలస ప్రాజెక్టులోకి 3వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి మూడు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నీరు వచ్చి చేరుతుందని అధికారులు ఆదివారం వెల్లడించారు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మూడు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.34 మీటర్లు లెవెల్ నీటి మట్టం నమోదైంది. ఒక గేటు ఎత్తి 1720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు.
గోవా గవర్నర్‌కు
ఘన స్వాగతం
విజయనగరం: గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజుకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం విజయనగరం విచ్చేశారు. ఆయనకు స్థానిక అశోక్ బంగ్లా వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇన్‌చార్జ్ ఆర్డీవో మురళి, అశోక్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంతకు ముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంగ్లాకు చేరుకొని, అశోక్ గజపతిరాజుకు పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా దీపోత్సవం
బొబ్బిలి: పట్టణంలోని దిబ్బ వీధిలో వెలసిన వినాయక మండపంలో ఆదివారం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తి గీతాలు ఆలపించగా పురోహితులు మంత్రోచ్ఛారణ చేశారు. పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఐదో రోజైన ఆదివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ప్రతీ రోజు వినతులు అందజేయవచ్చు..: కలెక్టర్