
శారీరక దృఢత్వంతో ఆరోగ్యం
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి
● జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ ఆన్ సండే
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ ఆన్ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ధృడత్వంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం మన జీవన శైలిలో ప్రతీ రోజు ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణిస్తూ ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు సైక్లింగ్ సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సరళమైన, సురక్షితమైన మార్గంతో పాటు పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకొనేందుకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లి మళ్లీ మైదానానికి చేరుకుంది. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.