
మహానేత వర్ధంతికి తరలిరండి
● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
సాలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో స్థానిక విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న మహానేత వర్ధంతి కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలంతా పాల్గొనాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మకుటం లేని మహరాజని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, 108, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. రైతు రుణ మాఫీ, పంటలకు ఉచిత విద్యుత్ ద్వారా రైతు బాంధవుడుగా గుర్తింపు పొందారన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు గొప్ప చదువులు చదివారని గుర్తు చేశారు. జల యజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా పాచిపెంట మండల కేంద్రంలో పెద్దగెడ్డ రిజర్వాయర్‌ను నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చి వేలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేశారని చెప్పారు. వ్యవసాయాన్ని రాజశేఖరరెడ్డి పండగగా మార్చితే, చంద్రబాబు దండగని నిర్వీర్యం చేశారన్నారు. నియోజకవర్గంలో పెద్దగెడ్డతో పాటు బురదాలమ్మ ఎత్తిపోతల పథకం నిర్మాణం రాజశేఖరరెడ్డి పాలనలోనే జరిగిందన్నారు. మక్కువ మండలం వెంగళరాయసాగర్, మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టుల ఆధునికీకరణకు జైకా నిధుల మంజూరుకు ప్రతిపాదనలు వైఎస్సార్ పాలనలోనే జరిగాయన్నారు. పావురాయిగెడ్డ, దళాయివలస మినీ రిజర్వాయర్లకు నాడు రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు చేశారన్నారు. వైఎస్సార్, ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు.