
పేరుకే రేషన్ పంపిణీ..!
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తూ లబ్ధిదారుల నుంచి ఎప్పటిలాగే అరకేజీ పంచదారకు రూ.17లు తీసుకుంటూ కేవలం ఈ రెండు సరుకులను మాత్రమే తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. జిల్లాలో 2,76,873 మంది లబ్ధిదారుల ఉండగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా గడప దాటకుండా లబ్ధిదారులకు బియ్యం, కందిపప్పు, పంచదారలతో పాటు సీజనల్‌గా గోధుమ పిండి, రాగులను పంపిణీ చేసేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేసే వ్యవస్థను రద్దు చేస్తూ జిల్లా వ్యాప్తంగా 578 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంది. అయితే కేవలం రెండు సరుకుల పంపిణీకే ఈ రేషన్ దుకాణాలు నోచుకుంటున్నాయి. ఈ క్రమంలో పేరుకే ప్రభుత్వ రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థ అన్నట్టు లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు సరుకులకే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సైతం లబ్ధిదారులు కిలోమీటర్ల మేర దూరంగా ఉన్న వారికి సంబంధించిన రేషన్ దుకాణాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతూ ఆ రోజు వారి పనులు పక్కన పెట్టి ఆటోలకు లేదా బండిలో పెట్రోల్ పోసుకొని లేదా తలపై బరువులు మోస్తూ శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కందిపప్పుకు కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వంపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 14 నెలలు కాలం గడుస్తున్నా పండగలకు ఇస్తామన్న కానుకల పంపిణీ విషయమై కూడా ఊసే లేకుండా వ్యవహరిస్తుంది.
కందిపప్పు కనుమరుగు, పంచదారలో
నాణ్యత లోపం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కందిపప్పు రేషన్ ద్వారా పంపిణీని నిలిపివేసింది. ఏ ప్రభుత్వంలోనైనా రేషన్ పంపిణీ ద్వారా నాణ్యత గల సరుకులు మార్కెట్‌లో కన్నా అతి తక్కువ ధరకే అందుతాయన్న ఆశతో లబ్ధిదారులు ఆశిస్తారు. అయితే ఈ ప్రభుత్వంలో ఆ ఆశలన్నీ నిరాసై కేవలం బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇచ్చిన అరకేజీ పంచదార కూడా నాణ్యత లేకుండా తెల్లగా ఉండాల్సిన పంచదార కాస్త ముదురు గోధుమ రంగులో ఉంటూ దుర్వాసన వస్తూ పంచదార కాస్త చిన్న తడిపదునుతో ఉంటుంది.
కిలోమీటర్ల మేర శ్రమభారం
ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తూ ప్రజలకు గత ప్రభుత్వం సేవలందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సేవలను కాస్తా కక్షపూరితంగా నిలిపివేసి ప్రజలను అవస్థలకు గురి చేస్తుంది. ఇచ్చిన బియ్యం, పంచదారకు లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ షాపులకు వెళ్లేందుకు కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో అవస్థలు పడుతూ తిరుగు ప్రయాణంలో తమ నెత్తిపై బాబు ఇలా బరువు భారాన్ని వేశారా అంటూ బియ్యం మూటలను మోసుకుంటూ ఇళ్లకు బయలు దేరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో అయితే మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలకు సమీపంలో ఉన్న 101 రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకొనేందుకు వచ్చి కిలోమీటర్ల మేర ఇచ్చిన బియ్యాన్నే బ్రతుకు జీవుడా అంటూ అవస్థలు పడుతూ మోసుకువెళ్తున్నారు. పట్టణాల్లో అయితే ఆటో చార్జీలు వెచ్చిస్తున్న లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ సరుకుల కంటే చార్జీలే ఎక్కువ అవుతున్నాయంటూ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో రేషన్ దుకాణాల వద్ద కాస్త క్యూ ఉన్నా లేదా సర్వర్ పని చేయకున్నా నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి.
పంపిణీలో కనుమరుగైన కందిపప్పు
ఇచ్చిన కాస్త పంచదారలో నాణ్యత లోపం
ఇచ్చిన రెండు సరకులకు కిలోమీటర్ల మేర శ్రమభారం
జిల్లాలో 2,76,873 మంది లబ్ధిదారులు
రేషన్ దుకాణాలు 477– గిరిజన
ప్రాంతాల్లో 101
సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం..
రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. కందిపప్పు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు అందించాం. ప్రభుత్వం నుంచి సరఫరాకు సంబంఽధించిన అనుమతులు వస్తే కందిపప్పు పంపిణీ జరుగుతుంది. పంచదార ఎక్కడైనా నాణ్యత లేకుంటే మా దృష్టికి వచ్చిన వెంటనే పరిశీలించి నాణ్యత లోపం రుజువైతే పంచదారను మార్చి పంపిణీ చేస్తాం. వచ్చే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడో విడతలో రేషన్ స్మార్ట్‌కార్డులు పంపిణీ ఉంటుంది.
– కె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా

పేరుకే రేషన్ పంపిణీ..!

పేరుకే రేషన్ పంపిణీ..!

పేరుకే రేషన్ పంపిణీ..!

పేరుకే రేషన్ పంపిణీ..!