
యువకుడిని కత్తితో పొడిచిన వ్యక్తి అరెస్ట్
మక్కువ: మండలంలోని దేవరశిర్లాం పంచాయతీ లోవరఖండి గ్రామానికి చెందిన ఓ యువకుడిని కత్తితో పొడిచిన వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ విలేకరులతో శనివారం మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. లోవరఖండి గ్రామానికి చెందిన సాగరపు దమయంతి మేనళ్లులు మహేశ్, కిశోర్ వినాయకచవితి పండగకు జగన్నాధపురం గ్రామం నుంచి లోవరఖండి చేరుకున్నారు. సాయంత్రం లోవరఖండిలో వాలీబాల్ ఆటను మహేశ్, కిశోర్‌లు ఆడుతుండగా, అదే గ్రామానికి చెందిన సాగరపు శివందొర అలియాస్ ఆదినారాయణ బెట్టింగ్ కట్టి నాతో వాలీబాల్ ఆడాలంటూ, మహేశ్, కిశోర్‌ల వైపు చక్కరగుత్తి (ధాన్యం నాణ్యత చూసే పరికరం) చూపిస్తూ బెదిరించాడు. దీంతో వీరి మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శివందొరకు చిన్నపాటి గాయాలయ్యాయి. అంతేకాకుండా అప్పటికే రెండు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. సాగరపు దమయంతికి ఐదు ఆవులు ఉన్నాయి. శివందొర గ్రామంలో మొక్కలు పెంచుతున్నాడు. దమయంతికి చెందిన ఆవులు మొక్కలను మున్ముందు తినేస్తాయంటూ, దానివలన నష్టం జరిగే అవకాశముందని శివందొర ముందుగానే ఊహించుకొని, దమయంతి కుటంబంతో గొడవపడ్డాడు. తనను, నా భార్య హేమలతను తరుచూ ఎందుకు తిడుతున్నారంటూ, ఇంటిలో ఉన్న చక్కరగుత్తి పట్టుకొని, దమయంతి పైకి శివందొర వెళ్లాడు. ఇంటి మేడపై పిల్లలతో ఆడుకుంటున్న కార్తీక్ కిందకు దిగి అడ్డుకోబోతుండగా కత్తిపోటుకు గురై మృతి చెందినట్టు సీఐ తెలిపారు. నిందితుడు శివందొరను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్‌ఐ మామిడి వెంకటరమణ ఉన్నారు.