
సారాను అరికడదాం.. : కలెక్టర్
పార్వతీపురం రూరల్: సారాను అరికట్టి కుటుంబాలను కాపాడుదామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. మత్తు మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శనివారం తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారాతో యువత కూడా అనారోగ్యం పాలవుతున్నారని, ఈ మేరకు వారిలో పనిచేసే శక్తి తగ్గి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. ఈ మేరకు మత్తు మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసే వారికి విధిగా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతం గుండా, బస్సులు ఇతర వాహనాల ద్వారా అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల వలన కలిగే చెడు ప్రభావాలపై విద్యా సంస్థల్లో, గ్రామ స్థాయిల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు సమావేశంలో పాల్గొన్న ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి పోలీసు శాఖా పరమైన తీసుకున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకితా సురానా, డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి పి.దుర్గాప్రసాద్, జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి ఆశాషేక్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.