
ఆదాయ వనరులను సమకూర్చుకోండి
● పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ కృష్ణతేజ
బొబ్బిలి రూరల్: పంచాయతీల్లోని ఇళ్ల పన్నులు, వాణిజ్య సముదాయాలు, ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యువల్, తదితర పద్ధతుల ద్వారా పంచాయతీలకు ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎం.కృష్ణతేజ సూచించారు. మండలంలోని మెట్టవలస, జగన్నాథపురం గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. జగన్నాథపురంలో డీడీఓ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించి రేకులతో కాకుండా శాశ్వత భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలను తెలుసుకున్నారు. ఆయనకు ఉచిత బస్సు వల్ల ఉపాధికోల్పోయామని ఆటోడ్రైవర్లు, 19 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు పెరగలేదంటూ ఫీల్డు అసిస్టెంట్లు వినతిపత్రాలు అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీడీఓ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ పి.రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.