
2025లో సరఫరా అయిన యూరియా 11,355 టన్నులు
ప్రస్తుతం ఆర్బీకేలు కాస్త ఆర్‌ఎస్‌కేలు మారాయి. వాటి సంఖ్య గణనీయంగా కుదించగా 2025 ఖరీఫ్ సీజన్లో కేవలం 11,355 టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. అది కూడా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందన్నది రైతుల వాదన. అందమైన వసంతం తరువాత మంటెక్కించే గ్రీష్మం వచ్చినట్లు.. తీయని నేతి మిఠాయి తిన్నాక గొడ్డుకారం చప్పరించినట్లు.. చల్లని మంచు కాళ్లను గిలిగింతలు పెడుతున్న దారిలో నడిచిన అనంతరం నిప్పుకణికల్లా మండుతున్న రాళ్ల దారిలో అడుగేస్తున్నట్లు.. శ్రావ్యమైన సంగీతం విన్నాక గార్ధభ గాత్రం మన మనసును పాడు చేసినట్లు.. రైతు పక్షపాతి అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన తరువాత సేద్యం అంటేనే అసహ్యించుకునే చంద్రబాబుపాలన మొదలైందన్నది రైతుల మాట. ప్రస్తుతం రైతన్నలను కష్టాలే పలకరించాయి.. కాదు కాదు.. నేరుగా తలుపులు బద్దలుగొట్టుకుని రైతు ఇళ్లలో కష్టాలు తిష్టవేశాయి. ఓ ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. ఏదోలా అప్పోసప్పో చేసి పంటలు పండిస్తే అవి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి.. నిన్నమొన్నటివరకు ఊరిలో ఠీవీగా నిలబడిన ఆర్బీకేలను కాస్త ఆర్‌ఎస్‌కేలుగా పేరుమార్చి ఉసురు తీసేయడంతో అవి వెలవెలబోతున్నాయి. ధాన్యాన్ని అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏ పంట వేయాలో చెప్పేవారు లేరు. చేతిలో ఉన్న మరచెంబులోని నీళ్లను లాక్కుని సహారా ఎడారి మధ్యలో వదిలేసినట్లుంది రైతుల పరిస్థితి. చనుబాలకోసం పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నా పాలులేవని.. పాలివ్వలేనని.. బిడ్డ ఆకలితీర్చలేనని చెప్పలేని తల్లి పరిస్థితి రైతుకు దాపురించింది. నాట్లు వేసే చివరి కార్తె అయిన పుబ్బ వచ్చేసింది. ఇప్పటికే ఆశ్లేష కార్తెలో వేసిన ఉభాల్లో గాబు తీతలు అయిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చేను నల్లగా కమ్ముకురావాల్సిన రోజులొచ్చేశాయి. కానీ, పైన చంద్రబాబు ఉన్నాక ఇక చేను ఎలా నవ్వుతుంది.. ఎటు చూసినా యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు దొరికే పరిస్థితి లేదు. వచ్చిన కాసిన్ని బస్తాలు సొసైటీల నుంచి నేరుగా టీడీపీ నేతల గోదాముల్లోకి తరలిపోతున్న దారుణం. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా సినిమా చూసినట్లు చూడడం తప్ప ఏమీ చేయలేని అశక్తత. నడిసముద్రంలో మునిగిపోతూ గుక్కెడు నీటికోసం ఆకాశం కోసం చూస్తున్న పరిస్థితి. కడుపులో పట్టెడన్నం పడి మూడ్రోజులైంది.. ఎవరైనా కాసింత గంజి పోస్ట్ బాగుణ్ణు అనే దుస్థితి. చేనుకు ఎరువు వేయకపోవడంతో ఎదుగుదల లోపించింది. ఎరువుల కోసం చాంతాడంత లైన్లలో గంటలతరబడి నిలబడాల్సి రావడం. తమ కళ్లముందు నుంచి తరలిపోయిన ఎరువులు అంతలోనే బ్లాక్ మార్కెట్లో కనిపించడం.. రెట్టింపు ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి రావడం. ఇదంతా తమ ప్రారబ్ధం అనుకుంటూనే రైతులు పొలం వైపు సాగుతున్నారు. మంచి రోజులు ఎప్పుడొస్తాయా అంటూ ఊపిరిబిగబట్టి పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు.