
చెట్టుకిందనే ప్రసవం
బొబ్బిలిరూరల్:
ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తుండగా పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. బొబ్బిలి ఆర్టీసీ కాంపెక్స్‌కు ఎదురుగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఓ చెట్టుకిందనే ఏడో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎనిమిదేళ్ల కుమార్తె తల్లికి సపర్యలు చేసింది. వివరాల్లోకి వెళ్లే...
బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని అక్కేనవలస గిరిజన గ్రామానికి చెందిన దుబ్బాక పార్వతి 9 నెలలు నిండు గర్భిణి. భర్త లక్ష్మణతో కలిసి రామభద్రపురం మండలంలోని రొంపల్లి సమీపంలోని పామాయిల్ తోటలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె చనిపోయింది. శుక్రవారం ఏడో సంతానంలో పార్వతికి పురిటినొప్పులు రావడంతో తన 8 ఏళ్ల వయసున్న పెద్దకుమార్తె శైలజను వెంటపెట్టుకుని ఆటోలో బొబ్బిలి సీహెచ్‌సీలో చేరేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో దిగారు. అప్పటికే పార్వతికి నొప్పులు ఎక్కువ కావడంతో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. శైలజ భయపడకుండా తల్లికి సపర్యలు చేస్తూనే ఉంది. కాళ్లు, చేతులు నిమురుతూ తల్లికి ధైర్యం చెప్పింది. ఇంతలో తల్లి పార్వతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న కొంతమంది పాత్రికేయులు 108కు సమాచారం ఇవ్వడంతో తల్లీబిడ్డను బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యచికిత్స పొందుతున్నారు.
మొన్న కొత్తబట్టివలస, నేడు అక్కేన వలస...
బొబ్బిలి నుంచి పార్వతీపురం రాష్ట్రీయ రహ దారి వైపు ఉన్న దాదాపు 10 పంచాయతీలకు వైద్యసేవలు అందుబాటులో లేవు. ఈ పంచాయతీల్లో ఎవరికీ వైద్యసహాయం కావాలన్నా 25 కిలోమీటర్ల దూరంలోని పిరిడి పీహెచ్‌సీకి వెళ్లాలి. అంతదూరం వెళ్లేందుకు ఇష్టపడని గిరిజనులు గ్రామాల్లోనే ఉంటూ సుఖప్రసవం కోసం ప్రయత్నించి చివరి నిమిషాల్లో వైద్యసహాయాన్ని పొందుతున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు లేని గిరిజన గ్రామాల్లో డోలీలే దిక్కవుతుండగా, ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాంటి ప్రసవాలు చోటుచేసుకుంటున్నాయి. పది రోజుల కిందట కొత్త బట్టివలస గ్రామానికి చెందిన నిండు గర్భిణిని 5 కిలోమీటర్లు డోలీలో మోసుకుని పిరిడి పీహెచ్‌సీకి తరలించగా, నేడు ఆ పక్కనే ఉన్న అక్కేనవలస గిరిజన గ్రామం మహిళ ఆస్పత్రికి వస్తూ చెట్టుకిందనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అత్యవసర వైద్యసహాయం కోసం గిరిజన పంచాయతీలకు చేరువలో పీహెచ్‌సీని ఏర్పాటుచేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.