
తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం రూరల్: తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తెలుగుభాష చిరస్థాయిగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన తెలుగుభాష దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి వాడుక భాష ఉద్యమానికి చేసిన కృషిని కొనియాడారు. విద్యార్థుల కోసం వచ్చేనెల 5న తెలుగు మాస పత్రికను విడుదల చేస్తామని, అందులో విద్యార్థులకు అవసరమైన సమాచారంతోపాటు రచనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్యప్రదర్శనలు అలరించాయి. ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ తేజేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీపీఆర్వో ఎల్.రమేష్, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన అవసరం
ప్రభుత్వ పరమైన ప్రాధాన్యత గల అంశాలపట్ల రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్‌తో పాటు వీఆర్‌ఓలు తదితర సిబ్బంది రెవెన్యూ పనుల్లో భాగస్వాములేనని తేల్చిచెప్పారు. విధుల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, స్పప్నిల్‌జగనాథ్, ఎస్‌డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్. దిలీప్‌చక్రవర్తి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రెవెన్యూ అసోసియేషన్ రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ విడుదల చేశారు.