
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచడానికి రైతులకు అవగాహన కల్గించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు కాకుండా కొత్త గ్రామాల్లో సర్వే చేసి కొత్త రైతులను గుర్తించి వచ్చే రబీ నుంచి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన చాంబర్‌లో శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయిలో 3 రోజులు పాటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, తదుపరి గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో పాటు, మండల స్థాయి ప్రత్యేకాధికారులను డ్వాక్రా మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. ర్యాలీలు నిర్వహించాలని, ఎగ్జిబిషన్ ప్రదర్శనలను నిర్వహించి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. రైతుల నుంచి సలహాలు, సూచనలను కూడా తీసుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వీటిన్నటిని సమోదు చేసి డాక్యుమెంటరీని తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు ముందుకు వచ్చిన వారి జాబితాను తీసుకుని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రుపొందించాలని అన్నారు. జిల్లాలో గుర్తించిన 290 క్లస్టర్‌లో బేసిక్ సర్వే ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, జిల్లా వ్యవసాయ అధికారి తారాకరామారావు, డీపీఎం ఆనందరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, మత్య్స శాఖ డి.డి విజయ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.