
ఇక ఆన్‌లైన్‌లో రిమాండ్ ఖైదీల విచారణ
బొబ్బిలి: రిమాండ్‌లో ఉన్న ఖైదీలను జైలు నుంచి కోర్టులకు తరలించే సమయంలో భద్రత, సమయం, తరలింపు తదితర అంశాలను మరింత మెరుగు పర్చుకునే క్రమంలో కొన్ని మార్పులు చేసినట్టు జిల్లా జైళ్ల అధికారి జి.మధుబాబు తెలిపారు. స్థానిక సబ్ జైలును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రిమాండ్ ఖైదీల విచారణ సమయంలో కోర్టులకు తరలించే వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు, మరింత సులువుగా మెరుగైన ప్రక్రియ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే వారి కేసులను విచారించేందుకు ఉన్నత న్యాయమూర్తుల ఆదేశాల మేరకు జైళ్లలో తగు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి సబ్ జైళ్లలో 150 మంది వరకూ వివిధ కేసులకు సంబంధించి రిమాండ్ ఖైదీలున్నారన్నారు. ఇవి నడుస్తున్న భవనాలు బ్రిటిష్ కాలం నాటివి కావడంతో కొత్త భవనాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాల గుర్తింపునకు రెవెన్యూ అధికారులకు ప్రతిపాదించినట్టు చెప్పారు. జిల్లా జైలు కోసం సారిక వద్ద ఏడెకరాలను, బొబ్బిలి సబ్ జైలు కోసం గ్రోత్‌సెంటర్ వద్ద ఐదెకరాలను గుర్తించామన్నారు. మిగతా సబ్‌జైళ్ల స్థలాలు కూడా గుర్తిస్తే భవన నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామన్నారు. సబ్ జైలర్ పాత్రో, సిబ్బంది ఉన్నారు.
జైళ్ల అధికారి మధుబాబు