
వారంలో ఆరు చెరువుల పనులకు ప్రతిపాదనలు : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఆరు మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. వందెకరాలు దాటినవి, ఉవా ఆధ్వర్యంలో ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువులు మరమ్మతులు, పునరుద్ధరణ, విస్తీర్ణంకు సంబంధించిన పనులు కింద ముందుగా గుర్తించామన్నారు. మిగిలిన 100 చెరువులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ అప్‌లోడ్, పీఎం కుసుమ్, పింఛన్లు, జూవైనల్, జస్టిస్ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2,808 చెరువులు ఉన్నాయని, వీటికి సంబంధించి 74 చెరువులకు ఆర్‌ఆర్‌ఆర్ కార్యక్రమంతో పనులు నిర్వహించగా మిగిలిన వాటికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. మరో 29 చెరువులకు ప్రణాళికలను వచ్చే నెల 16నాటికి సిద్ధం కానున్నాయన్నారు. అలాగే 29 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ నిమిత్తం 97 ఎకరాల స్థలం అవసరం మేరకు ఇప్పటికే 92.95 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాన్నారు. ఈ మేరకు మరికొన్ని కార్యకలాపాలపై సీఎస్‌కు వివరించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ హేమలత, ఎస్‌డీసీ ఎస్.దిలీప్‌చక్రవర్తి, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, జిల్లా వ్యవసాయశాఖాధికారి కె.రాబర్ట్‌పాల్, నీటి పారుదల, జలవనరుల, ఏపీఈపీడీసీఎల్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.